అవి అసలు ఎన్నికలే కాదు..: రఘువీరా

12 September, 2017 - 8:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: మన దేశానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ చాలా ప్రమాద‌క‌రమ‌ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుడు నీలకంఠాపురం ర‌ఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ బీజేపీ అనుబంధ‌ సంస్థలని ఆయన అభివర్ణించారు. విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో మంగళవారం మీడియా స‌మావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడారు. ఆ మూడు పార్టీల నేత‌లూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల‌, కాకినాడ‌లో జ‌రిగిన ఎన్నిక‌లు అసలు ఎన్నిక‌లే కాదని రఘువీరారెడ్డి అన్నారు. ఆ రెండు చోట్లా ఎన్నికలు పూర్తిగా అనైతికంగా జ‌రిగాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నిల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ కూడా దారుణంగా విఫ‌లమైందని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని జనం మెచ్చుకునేలా తాము ప‌నిచేసి చూపిస్తామ‌ని రఘువీరారెడ్డి చెప్పారు.