కళ్యాణ్‌‌రామ్‌-తమన్నా చిత్రం టైటిల్ ‘నా నువ్వే’

09 January, 2018 - 4:04 PM

నందమూరి కళ్యాణ్‌‌రామ్‌ కథానాయకుడిగా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘నా నువ్వే’ అనే టైటిల్‌ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రఖ్యాత కెమెరామన్ పి.సి. శ్రీరామ్ ఈ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఒక టోటల్ ఫ్రెష్ లుక్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతాన్ని అందిస్తున్నారు.

‘జనవరి నెలాఖరుకి దాదాపుగా షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి నా నువ్వే అనే టైటిల్ చాలా ఆప్ట్‌గా ఉంటుంది. ఒక నూతన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ లుక్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు జయేంద్ర తీర్చిదిద్దుతున్నారు. కళ్యాణ్‌రామ్, తమన్నాల కాంబినేషన్ ఈ చిత్రానికే హై లైట్‌గా నిలుస్తుంది. పి.సి. శ్రీరామ్ కెమెరా వర్క్ ‘నా నువ్వే’ చిత్రానికి చాలా పెద్ద అసెట్’ అని నిర్మాతలలో ఒకరు కిరణ్ ముప్పవరపు తెలిపారు.

‘పి.సి. శ్రీరామ్, జయేంద్ర వంటి టాప్ క్వాలిటీ టెక్నికల్ టీంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. హీరో కళ్యాణ్‌రామ్‌కు ఈ చిత్రం ఒక టోటల్ మేకోవర్ ఇస్తుంది అని నమ్ముతున్నాం. వేసవి సెలవుల్లో చిత్రాన్ని విడుదల చేయటానికి సిద్ధపడుతున్నాం` అని సమర్పకుడు మహేష్ కోనేరు తెలిపారు.

లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఉండే ఈ చిత్రంలో, కళ్యాణ్‌రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖవాణి  ప్రధాన నటులు. ఇతర నటీ నటుల వివరాలు త్వరలో తెలుపుతాం అని యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ చిత్రానికి నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ: మహేష్ ఎస్ కోనేరు, సంగీతం: షరెత్, సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్, ఎడిటింగ్‌: టి.ఎస్. సురేష్, కథ, స్క్రీన్‌‌ప్లే- జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర.