‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ రివ్యూ

04 May, 2018 - 11:12 AM

సినిమా పేరు: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
జానర్: యాక్షన్‌ డ్రామా
నటీ నటులు: అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యూయేల్‌, అర్జున్‌, శరత్ కుమార్‌, బొమన్‌ ఇరానీ, రావు రమేష్‌
సంగీతం: విశాల్‌ – శేఖర్‌
కథ, స్క్రీన్‌‌ప్లే, మాటలు, దర్శకత్వం: వక్కంతం వంశీ
నిర్మాత: లగడపాటి శ్రీధర్‌, నాగబాబు, బన్నీ వాసు

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియా కంటే ముందుగా యూఎస్ఏలో భారీగా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఇక ఏపీలో శుక్రవారం తెల్లవారు జుమున 5 గంటలకే అనేక చోట్ల బెనిఫిట్ షోలు నడిచాయి. అన్ని చోట్ల నుండీ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఫస్టాప్ యావరేజ్ అని పలువురు అంటున్నారు. సెకండాఫ్ చాలా బాగుందనేది మరి కొందరు ప్రేక్షకుల అభిప్రాయంగా ఉంది. వక్కంతం వంశీ కథ, డైరెక్షన్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌‌కు మంచి మార్కులు పడుతున్నాయి.

ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిఫరెంట్‌ మేకోవర్‌‌లో.. సరికొత్త మేనరిజమ్స్‌‌తో సోల్జర్‌ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌, సాంగ్స్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అందుకుందా? వరుస విజయాలతో మంచి ఊపులో ఉన్న బన్నీ మళ్లీ తన స్టామినాను నిరూపించుకున్నాడా? అనేక సక్కెస్‌ఫుల్ స్టోరీలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విజయం సాధించాడా? అంటే వెండితెర మీద చూస్తేనే బావుంటుంది.సినిమా కథ:
సూర్య (అల్లు అర్జున్‌) కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని యువకుడు. తన ఆవేశంతో ప్రతీ ఒక్కరితో గొడవపడుతూ ఉంటాడు. చిన్నతనంలో ఓ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు. ఈ క్రమంలో ఓ మినిస్టర్‌ కొడుకుతో గొడవపడటం, తరువాత ఆర్మీ నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తిని చంపటంతో ఉన్నతాధికారులు సూర్య మీద చర్యలు తీసుకుంటారు. తన మీద తనకు కంట్రోల్‌ లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ ఆర్మీ నుంచి సస్పెండ్‌ చేస్తారు. తిరిగి ఆర్మీలో చేరాలంటే తాను మానసికంగా ఫిట్‌‌గా ఉన్నట్లు ప్రముఖ సైకాలజిస్ట్‌ రామకృష్ణం రాజు (అర్జున్‌) నుంచి సర్టిఫికేట్‌ తీసుకురావాలని కండిషన్‌ పెడతారు. ఆ పని మీద వైజాగ్‌ వచ్చిన సూర్యకు సమస్యలు ఎదురవుతుంటాయి. చల్లాతో గొడవలు పెట్టుకుంటాడు. ఇంతకీ రామకృష్ణంరాజుకు సూర్యకు మధ్య సంబంధం ఏంటి? సూర్య తన క్యారెక్టర్‌‌ని వదులుకొని తిరిగి ఆర్మీలో చేరాడా? అదే మిగతా కథ.

అల్లు అర్జున్‌ గతంలో ఎన్నడూ చేయని ఓ విభిన్నమైన క్యారెక్టర్‌‌లో కనిపించాడు. యాంగ్రీ యంగ్‌‌మాన్‌‌గా మంచి నటన ప్రదర్శించాడు. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని యువకుడిగాను అదే సమయంలో దేశం కోసం ప్రాణం ఇచ్చే దేశభక్తుడిగాను ఆకట్టుకున్నాడు. రొమాంటిక్‌ సీన్స్‌‌లోనూ తన మార్క్‌ చూపించాడు. బన్నీ స్టైలిష్‌ డాన్స్‌ మూమెంట్స్‌ సినిమాకు హైలెట్‌‌. యాక్షన్‌ సీన్స్‌‌లో బన్నీ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది.
హీరోయిన్‌‌‌గా వర్ష పాత్రలో అనూ ఇమ్మాన్యూల్‌ ఆకట్టుకోవడానికి యత్నించింది. ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్‌ షోతోనూ అలరించింది. రామకృష్ణంరాజు పాత్రలో నటించిన సీనియర్‌ నటుడు అర్జున్‌ సెటిల్డ్‌ ఫెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్నాడు. స్టైలిష్‌‌గా కనిపించిన అర్జున్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. శరత్‌ కుమార్‌ తనకు అలవాటైన ఎగ్రెసివ్‌ రోల్‌‌లో మరోసారి మెప్పించాడు. మరో విలన్‌ అనూప్‌ థాకూర్‌ సింగ్‌ యాక్షన్‌ సీన్స్‌‌లో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో బొమన్‌ ఇరాని, వెన్నెల కిశోర్‌, రావు రమేష్‌, ప్రదీప్‌ రావత్‌ తమ పరిధి మేరకు మెప్పించారనే చెప్పుకోవచ్చు.


విశ్లేషణ :
సూపర్‌ హిట్ కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌ ఎంచుకున్నాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌‌ను అభిమానులకు డిఫరెంట్ మేకోవర్‌‌లో చూపించాడు. లుక్‌ పరంగానే కాకుండా బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌ ఇలా ప్రతీ విషయంలోనూ బన్నీని కొత్తగా చూపించాడు. మొదటి నుంచీ సినిమాను దేశభక్తి సినిమాగా ప్రమోట్‌ చేసినా రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అయితే తొలి భాగాన్ని ఆసక్తికరంగా నడిపించిన వంశీ, రెండో సగంలో మాత్రం కొద్దిగా తడబడ్డాడనిపిస్తుంది. సెకండ్‌ హాఫ్‌ కథనం కాస్త నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్‌ శేఖర్‌ బన్నీ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్‌‌తో అలరించారు. మాస్ ఐటమ్‌ నంబర్‌, రొమాంటిక్‌ మెలోడి, ఫ్యామిలీ సాంగ్‌ ఇలా అన్ని వేరియేషన్స్‌‌లోనూ ఆకట్టుకున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌‌తో సినిమా స్థాయిని మరింత పెంచారు. వంశీ రాసిన డైలాగ్‌లు అద్భుతంగా ఉన్నాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి సినిమాకు మరో పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఆర్మీ సీన్స్‌‌తో పాటు ఇతర సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు రాజీవ్‌. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. సరిహద్దులో శత్రువుల కంటే.. దేశం లోపల ఉన్న దుష్టశక్తులు ప్రమాదకరమని భావించి వాటితో పోరాటం చేసే ఆవేశపరుడైన సైనికుడి కథే ఇది. అయితే తొలి ప్రయత్నంలో బలమైన కథ రాసుకున్న దర్శకుడు వక్కంతం వంశీ.. దానిని తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

ప్లస్‌ పాయింట్స్‌:
అల్లు అర్జున్‌ నటన
యాక్షన్‌ సీన్స్‌
బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌
మైనస్‌ పాయింట్స్‌:
సెకండ్‌ హాఫ్‌‌లో కొన్ని సీన్లు
స్క్రీన్‌‌ప్లే