భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం

08 June, 2018 - 2:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం నుంచీ నగరంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నగరవాసులను వాతావరణ శాఖ హెచ్చరించింది. పుణెలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వాతావరణ శాఖ హెచ్చరికతో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తన ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు రద్దు చేసింది. ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడే ప్రజలకు సేవలందించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాక అత్యవసర సమయంలో తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు ఇచ్చే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.జూన్ 8 నుంచి 12 వరకు అరేబియా సముద్రంలోని పలుచోట్ల వేటకు వెళ్లవద్దని కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మరోవైపు కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ముంబైకి విమాన సేవలన్నీ రద్దయ్యాయి. లండన్‌ నుంచి ముంబై వచ్చే జెట్‌ ఎయిర్‌‌వేస్‌ విమానాన్ని అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి తరలించారు.

ముందస్తుగా వచ్చిన ఈ రుతుపవనాలతో థానే, పాల్గఢ్‌, రాయ్‌‌ఘడ్‌, రత్నగిరి ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో, భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కూడా ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో ముంబై వాసులు 1916కు, ముంబై బయటివారు 1077కు ఫోన్ చేయవచ్చని బీఎంసీ తెలిపింది.

మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్‌‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా, కర్ణాటక, రాయమలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి.