‘కాపు బిల్లు’ను మొక్కుబడిగా పంపారు

13 June, 2018 - 4:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తున్నారని, రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు తమపై ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపు బిల్లును కేంద్రానికి చంద్రబాబు మొక్కుబడిగా పంపారన్నారు. ఆ బిల్లులో సరైన సమాచారం లేదని కేంద్రం వెనక్కి పంపిన మాట వాస్తవమా దా అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు.

ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో తగాదా వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారని మండిపడ్డారు. రాజస్థాన్‌, గుజరాత్‌​, హర్యానా తరహాలో కాకుండా గతంలో ఉన్న రిజర్వేషన్లనే కాపులు ప్రస్తుతం అడుగుతున్నారని ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత గుర్తుచేశారు.

‘1910వ సంవత్సరం (బ్రిటీష్ కాలం) నుంచి మా జాతికి రిజర్వేషన్ ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా మాకు రిజర్వేషన్‌ కల్పించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య హయాంలో కూడా రిజర్వేషన్ ఉంది. కానీ బీసీలుగా ఉద్యోగాలు పొంది, ఓసీలుగా కాపులు పదవీ విరమణ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తుగా ఓడించాలి. 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు మా రిజర్వేషన్లపై సృష్టత ఎవరు ఇస్తారో, అప్పుడు మా కాపు జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల పెద్దలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామ’ని ముద్రగడ తెలిపారు.