‘ఉద్యమ పార్టీకి…రాజకీయ పార్టీకి తేడా’

13 January, 2018 - 11:09 AM

(న్యూవేవ్స్ డెస్క్)

నల్లగొండ: సీఎం కేసీఆర్ కేబినెట్‌పై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీజీవో గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. వారి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శనివారం ఎంపీ గుత్తా మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో …అందులోని బలమైన నాయకులను టీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారని చెప్పారు. సుస్థిరమైన ప్రభుత్వం నడపాలనే తీసుకునే నిర్ణయంలో ఇలాంటివి సహజమన‍్నారు. స్థానిక పరిస్థితులు, జిల్లా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని గుత్తా చెప్పారు.

కాగా, తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు మంత్రివర్గంలో ఉన్నారన్న నాయిని వ్యాఖ్యలు వాస్తవమని ఆయన వ్యాఖ్యానించారు. అది తలచుకుంటేనే కన్నీళ్లొస్తున్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కేసీఆర్‌ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంటుందని తన నమ్మకమని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మే లేదు.. తెలంగాణలేదని ఆయన చెప్పారు. తెలంగాణకోసం పనిచేయనివాళ్లు ఇప్పుడు మాటలు చెబుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే అనంతరం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను శ్రీనివాస్‌ గౌడ్‌ ఖండించారు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా రెండురోజుల క్రితం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారని వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నామని చెప్పారు.