ప్రతిపక్షాల పప్పులు సింగరేణిలో ఉడకవ్

13 September, 2017 - 9:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: సింగరేణిలో ప్రతిపక్షాల పప్పులు ఉడకవ్ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క్ సుమన్ అన్నారు. సింగరేణి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్‌, టీడీపీ, లెఫ్ట్‌ అనుబంధ సంఘాలు ప్రకటించడం రాజకీయ వ్యభిచారం అని అభివర్ణించారు. ఇది కిచిడి కూటమి అని నిప్పులు చెరిగారు. సింగరేణి ఎన్నికలతోనే విపక్షాల పతనం ప్రారంభం అవుతుందన్నారు. ప్రతిపక్షాలను సింగరేణి బొందలగడ్డలో కార్మికులు బొంద పెట్టడం ఖాయమని సుమన్ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతు రాజుగా బతకాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని సుమన్‌ తెలిపారు. రైతు సమన్వయ సమితులను రాబందుల్లా అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రతి దానికీ కోర్టు గుమ్మం తొక్కడం విపక్షాలకు పరిపాటిగా మారిందని, రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు చివాట్లు పెట్టినా విపక్ష నేతలు సిగ్గు లేకుండా గవర్నర్‌ కలిశారని మండిపడ్డారు.

రైతు సమన్వయ సమితుల్లో సామాజిక న్యాయం పాటించామని, ఒక్కసారి జీఓ 39 మళ్లీ చదువుకుంటే విపక్షాలకు మంచిదని సుమన్ హితవు పలికారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

రైతు సమన్వయ సమితుల ఏర్పాటైన తర్వాత ఒక్క రైతు కూడా తమ వెంట రారనే భయంతోనే విపక్షాలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మిషన్‌ భగీరథలాగే రైతు సమన్వయ సమితులు దేశానికి రోల్‌ మోడల్‌ కావడం ఖాయమని సుమన్‌ పేర్కొన్నారు.