మోదీ, షా ద్వయం రెండు నాల్కల రాజకీయం!

10 August, 2017 - 4:36 PM

క్విట్ ఇండియా ఉద్యమం 75 వ వార్షికోత్సవాన్ని ఇండియా ఘనంగా జరుపుకుంది. ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం నాటి ‘కరేంగే యా మరేంగే’ నినాదాన్ని గుర్తు చేస్తూ, ‘కరేంగే, కర్‌కే రహేంగే’ అనే కొత్త నినాదాన్ని జాతికి అందించారు.

అదే రోజు పార్లమెంటు సమావేశమైన దేశ రాజధాని ఢిల్లీ నగరానికి పశ్చిమంగా గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ డ్రామా జరుగుతోంది. ఆరు నూరయినా నూరు ఆరయినా కాంగ్రెస్ అభ్యర్ధి అహ్మద్ పటేల్‌ను ఓడించాలన్న అధికారపక్షం పట్టుదల ఓ పెద్ద ప్రహసనానికి దారి తీసింది. బిజెపి అభ్యర్ధికి పడిన రెండు వోట్లు సాంకేతిక కారణంతో చెల్లకపోవడంతో అహ్మద్ పటేల్ గట్టెక్కారు. ‘కర్‌కే రహేంగే’కి అర్ధం ఇదే అనుకోవాలా?

ఇందులో రెండు ప్రశ్నలు  ఉన్నాయి. ప్రతిపక్షం ఎంత చెడ్డదయినా అది అసలు నామరూపాలు లేకుండా పోవాలని కోరుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది ఎలా అవుతుందన్న ప్రశ్న మొదటిది. కాంగ్రెస్‌ పార్టీ మార్కు రాజకీయాలకు మోదీ నాయ కత్వంలోని బిజెపి అతీతమా అన్నది రెండవది.

ఏ విధంగా చూసినా గుజరాత్‌ పరిణామాలు ప్రజాస్యామ్యప్రియులకు మింగుడు పడేవి కావు. కొద్ది సంవత్స రాలుగా ఫిరాయింపు రాజకీయాలు సిగ్గెగ్గులు లేకుండా తయారయ్యాయి. మూడేళ్ల క్రితం కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాజకీయాలు మరీ నీచ స్థాయికి దిగజారాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కలిసి నిర్లజ్జగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపు రాజకీయాలు కొత్తగా వచ్చినవేమీ కావు. ఏ పార్టీ కూడా ఈ రాజకీయాలకు మినహాయింపూ కాదు. అయితే గతంలో ఏదో ఒక సాకు వెదికేవారు. ఇప్పుడు ఏమీ అఖ్ఖరలేదు. తమను ఎన్నుకున్న ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు భావించడం లేదు.

స్పీకర్ల వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ఫిరాయింపు సభ్యులు ఏళ్ల తరబడి అనర్హత తప్పించుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో మంత్రులుగా కూడా కొనసాగుతున్నారు.

ఈశాన్య రాష్ట్రాలలో, గోవాలో అధికారం చేజిక్కించుకునేందుకు బిజెపి నాయకత్వం అడ్డమైన దారిలో నడిచింది. త్రిపురలో నిన్న కాక మొన్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యులందరినీ ఒక్కుమ్మడిగా పార్టీలో కలుపు కున్నది. గుజరాత్‌లో ఒక్క అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు మోదీ, షా ద్వయం చేసిన చేష్టలు చూస్తే ఈ దేశంలో రానున్న కాలంలో ప్రజాస్వామిక విలువలు ఇంకెంత లుప్తమై పోతాయో అన్న వెరపు కలగక మానదు.

అధికారం సంపాదించడం ఒక్కటే పరమావధిగా బిజెపి రాజకీయ క్రీడలు సాగుతున్నాయి. నరేంద్ర మోదీ నోటి వెంట వచ్చే మాటలకూ ఆయన చేసే, చేయించే పనులకూ మధ్య అంతరం అగాధంలా మారుతోంది. ఇందులో భయం కలిగే విషయం ఏమంటే ఆ అంతరం మోదీని మానసికంగా ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. తన నాయకత్వం కింద సాగే రాజకీయ వ్యభిచారాన్ని, హిందుత్వవాదుల అరాచకాలనూ ఆయన చిద్విలాసంగా చూడగలుగుతున్నారు. నిర్భయంగా మళ్లీ మళ్లీ సూక్తులు వల్లించగలుగుతున్నారు.

కొన్నాళ్ల క్రితం మోదీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ తన లక్ష్యమని గర్జించారు. ఇందులో రెండు ప్రశ్నలు  ఉన్నాయి. ప్రతిపక్షం ఎంత చెడ్డదయినా అది అసలు నామరూపాలు లేకుండా పోవాలని కోరుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది ఎలా అవుతుందన్న ప్రశ్న మొదటిది. కాంగ్రెస్‌ పార్టీ మార్కు రాజకీయాలకు మోదీ నాయకత్వంలోని బిజెపి అతీతమా అన్నది రెండవది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కూడా మోదీ కాంగ్రెస్ ముక్త్‌ భారత్ అని అనగలరు.

తాజాగా క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ‘బిజెపి క్విట్ ఇండియా’ అంటూ నినదించారు. ఆమె కూడా మోదీని ఆదర్శంగా తీసుకున్న ట్లున్నారు. బిజెపి రాజకీయాలు సమాజానికి ఎంత చెరుపు చేసేవయినా వాటిని నిరాకరించాల్సింది ప్రజలు. మితవాద మత రాజకీయాలతో దేశానికి ఎలాంటి హాని సంభవించేదీ ప్రజలు అనుభవంతో అర్ధం చేసుకున్నపుడే అది సాధ్యమవుతుంది. అప్పటివరకూ మోదీ, షా ద్వయం రాజకీయాలు వర్ధిల్లుతూనే ఉంటాయి. వారి రెండు నాలుకల ధోరణి కొనసాగుతూనే ఉంటుంది.

పదవీ విరమణ చేస్తున్న దేశ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ మొన్న రాజ్యసభ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ముస్లింలలో అభద్రతా భావన చోటుచేసుకుంటున్నదని పేర్కొన్నారు. అయనకి గురువారం రాజ్యసభలో వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ అన్సారీపై పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గియా పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, అన్సారీ రాజ్యసభ నడిపించడంలో తప్పులు చేశారని అన్నారు. ముస్లింలలో అభద్రత గురించి అన్సారీ మాటలతో తాను ఏకీభవించడం లేదనీ, ఆయన ఏదో పార్టీలో చేరేట్లు ఉన్నారనీ విజయ వర్గియా వ్యాఖ్యానించారు. హమీద్ అన్సారీ లాంటి పెద్దమనిషికీ, రాజనీతిజ్ఞుడికీ పదవీ విరమణ సమ యంలో బిజెపి ఇచ్చిన బహుమానం అది. అదీ మోదీ, షా నాయకత్వంలోని బిజెపి రెండు నాలుకల ధోరణి. మరికొంత కాలం ఈ ధోరణిని భరించక తప్పదు.

– ఆలపాటి సురేశ్ కుమార్