కాంగ్రెస్‌లోనే ఉండి.. తేల్చుకుంటాం

12 September, 2017 - 5:08 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, కమలం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పార్టీ మారే ఆలోచన తమ సోదరులకు లేదని, కాంగ్రెస్‌లోనే ఉండి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టుకుంటే ఎన్నికల్లో గెలుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లాలని, వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సరైన ఫలితాలు రావడం లేదని, ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందే అని కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తెగేసి చెప్పారు. పీసీసీ చీఫ్ పదవిని తమకు ఏడాది పాటు ఇవ్వాలని, తమకు ఇవ్వకపోతే తెలంగాణ కోసం ఉద్యమించినవారికైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి నాయకత్వంలో పార్టీ దూసుకుపోతుందో అధిష్టానం సర్వే చేయించాలని చెప్పారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని వెంకట్‌రెడ్డి తెలిపారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతానని ఆయన అన్నారు.