‘మెహబూబా’ మూవీ రివ్యూ

11 May, 2018 - 2:34 PM

సినిమా: మెహబూబా
జానర్: లవ్‌ ఎంటర్‌‌‌టైనర్‌
నటీనటులు: ఆకాష్‌ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే, రూప‌, అజ‌య్‌, పృథ్వీ త‌దిత‌రులు.
సంగీతం: సందీప్‌ చౌతా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌
నిర్మాత: పూరి కనెక్ట్స్‌

హీరోల‌కు మాస్ ఇమేజ్‌‌ను క‌ట్టబెట్టే ద‌ర్శకులు త‌క్కువ‌గా ఉంటారు. అలాంటి ద‌ర్శకుల్లో పూరీ జ‌గ‌న్నాథ్ ఒక‌రు. అయితే.. చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్‌ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు పూరీ జగన్నాథ్‌, తన కొడుకు ఆకాష్‌ను రీ లాంచ్‌ చేస్తూ తెరకెక్కించిన సినిమా మెహబూబా. ఈ ప్రేమ కథా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ముందు నుంచీ ఇది పూరికి కూడా రీ లాంచ్‌ లాంటి సినిమా అంటూ ప్రచారం చేశారు చిత్ర యూనిట్. నిజానికి పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. పూరీ డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీకి ఇటీవలి కాలంలో సక్సెస్‌‌లు తక్కువే. పూరీ తన రెగ్యులర్‌ స్టైల్‌‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ డిఫరెంట్‌ జానర్‌‌లో డిఫరెంట్‌ టేకింగ్‌‌తో చేసిన మెహబూబా పూరీకి సక్సెస్‌ అందించిందా? ఆకాష్‌ హీరోగా కమర్షియల్‌ హిట్ అందుకున్నాడా?
స్టోరీ:
రోషన్‌ (ఆకాష్‌ పూరీ)ను చిన్నతనం నుంచీ ఓ కల వెంటాడుతుంటుంది. తాను ఓ సైనికుడినని ఎవరో తనను చంపేశారని అనిపిస్తుంటుంది. అదే సమయంలో హిమాలయాల్లో తాను ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చానని ఒకే కల పదే పదే వస్తుంటుంది. అదే సమయంలో లాహోర్‌‌లో ఉన్న అఫ్రీన్‌ (నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేశారని భయపడుతుంటుంది అఫ్రీన్‌. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్‌ చదువుకోవాలనే వంకతో ఇండియా వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్లంతా అఫ్రీన్‌‌ను ఇండియా పంపించడానికి భయపడినా అఫ్రీన్‌ మాత్రం సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ ఇండియా వస్తుంది.

అలా హైదరాబాద్‌ చేరిన అఫ్రీన్‌‌ను.. రోషన్‌ ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆ సమయంలో రోషన్‌ ముఖం చూడని అఫ్రీన్‌ ఎలాగైనా తనకు సాయం చేసిన వ్యక్తిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పాలని అకుంటుంది. అఫ్రీన్‌ ఇండియాకు రావటం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న నాదిర్‌ (విషు రెడ్డి)కు నచ్చదు. అందుకే ఇంట్లో గొడవ చేసి ఆమెను తిరిగి పాకిస్తాన్‌‌కు పిలిపిస్తాడు.పాకిస్తాన్‌ వెళ్లేందుకు బయలుదేరిన అఫ్రీన్‌‌కు అదే ట్రైన్‌‌లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌‌కు వెళ్తున్న రోషన్‌ కలుస్తాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెబుతుంది. ట్రెక్కింగ్‌‌కు వెళ్లిన రోషన్‌‌కు అక్కడ తన గత జన‍్మకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌‌గా మళ్లీ పుట్టిందని తెలుసుకుంటాడు రోషన్‌. అసలు రోషన్‌‌కు తన గతం ఎలా తెలిసింది? పాకిస్తాన్‌ వెళ్లిపోయిన అఫ్రీన్‌‌ను రోషన్‌ ఎలా కలుసుకోగలిగాడు? చివరికి ఆ ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ.

నటీనటులు:
ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్‌.. చాలా రోజుల తరువాత మెహబూబాతో ఓ కమర్షియల్‌ హీరోగా రీ లాంచ్‌ అయ్యాడు. రెగ్యులర్‌ ఫార్మాట్‌ కమర్షియల్ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ జానర్‌ ఎంచుకున్నాడు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌‌ను ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్‌‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్‌ పరంగా మెప్పించిన ఆకాష్‌, కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌‌తో ఆకట్టుకున్నా.. డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ ప్రదర్శించే అవకాశం మాత్రం దక్కలేదు. హీరోయిన్‌‌గా పరిచయం అయిన నేహాశెట్టి పరవాలేదనిపించింది. విలన్‌‌గా విషు రెడ్డి ఆవేశం తప్ప అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్‌ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.
విశ్లేషణ:
ఆకాష్‌‌కే కాదు మెహబూబా పూరీ జగన్నాథ్‌‌కు కూడా రీ లాంచ్‌ లాంటిందే అని చెప్పాలి. అందుకే తన రెగ్యులర్‌ శైలిని పక్కన పెట్టి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, డిఫరెంట్‌ టేకింగ్‌‌తో సినిమా చేశాడు పూరి. కానీ పూరీ ప్రయత్నం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. పూరి తన ప్రేమకథకు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని జోడించాడు. తన స్టైల్‌ మార్చి కొత్త టేకింగ్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడనిపించింది. సినిమాలో పూరీ మార్క్‌ హీరోయిజం, డైలాగ్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ లేకపోవటం నిరాశ కలిగిస్తుంది. కథనంలో వేగం లేకపోవటం, ఏ మాత్రం లాజిక్‌ లేని సన్నివేశాలు ఇది పూరి సినిమానేనా అనే అనుమానం కలిగిస్తాయి. పూరీ జగన్నాథ్ ప్రేమకథలో ఓ ఆత్మ ఉంటుంది. అదే ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచుతుంది. మెహబూబా విషయంలో అన్నీ బాగున్నాయి. కానీ లవ్ స్టోరీకి మరింత అవసరమైన సోల్ మిస్సయిందనిపిస్తుంది.

చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతం అందించిన సందీప్‌ చౌతా పరవాలేదనిపించాడు. సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫీ. యాక్షన్‌ సీన్స్‌‌తో పాటు ట్రెక్కింగ్‌‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో మరికాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్‌ పాయింట్స్‌:
సినిమాటోగ్రఫి
ఆకాశ్ న‌ట‌న‌
నేప‌థ్య సంగీతం
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
ఫస్ట్‌ హాఫ్‌‌లో కొన్ని డైలాగులు
మైనస్‌ పాయింట్స్‌:
స్క్రీన్‌‌ప్లే
కొత్తదనం లేని కథ
లాజిక్‌ లేని సీన్స్‌
స్లో నెరేష‌న్‌
పూరీ మార్క్‌ కనిపించకపోవటం