మీడియాపై మల్లికార్జున ఖర్గే మండిపాటు

14 May, 2018 - 2:49 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: మొదటి నుంచీ ఎంతో ఆసక్తి రేకెత్తించి, ఉత్కంఠ భరితంగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ముగిసింది. పోలింగ్‌ అనంతరం ఆదివారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే దళిత నేత కోసం సీఎం పదవిని త్యాగం చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అధిష్టానం దళిత వ్యక్తిని సీఎంగా నియమిస్తానంటే తప్పకుండా ఒప్పుకుంటానని, నేనెవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్న సిద్ధరామయ్య ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బలవంతంగా ఎవరినీ సీఎం చేయడం కుదరదన్న ఆయన.. అలా జరిగిన పక్షంలో ప్రభుత్వాన్ని నడిపించడం కష్టం అవుతుందని వ్యాఖ్యానించారు.

సిద్దరామయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో ఖర్గే మాట్లాడుతూ.. దళిత సీఎం అంశంలో సిద్దరామయ్య వ్యాఖ్యలపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడమే మీడియా లక్ష్యంగా కన్పిస్తోందంటూ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీఎంగా ఎవరిని నియమించాలో అధిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు.

సామాజికవర్గం ఆధారంగా సీఎం పదవి లేదా ప్రతిపక్ష నేత పదవి ఇవ్వడం తనకు సంతోషాన్ని కలిగించదని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. తన సీనియార్టీ, పార్టీకి చేసిన సేవలను గుర్తించి పదవి ఇస్తే స్వీకరించడానికి తనకు అభ్యంతరం లేదంటూ మనసులోని మాటను ఖర్గే బయటపెట్టారు.