పరిహారానికి హదియా డిమాండ్

13 March, 2018 - 11:32 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కోజికోడ్: ఒక ముస్లిం యువకుడ్ని పెళ్లి చేసుకున్నందుకు సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన ‘లవ్ జీహీద్’ హదియా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర హైకోర్టు తన పెళ్లిని రద్దు చేసిన తర్వాత తాను చాలా నష్టపోయానని, తన తల్లిదండ్రులకు దూరమయ్యానని ఆమె వాపోయింది. ‘నేను నా తల్లిదండ్రుల నుంచి నష్టపరిహారం కోరినట్లు మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవం. నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కోరుతున్నాను’ అని హదియా కోజికోడ్‌లో విలేకరులకు తెలిపింది.

రెండున్నరేళ్ల పాటు తాను న్యాయపోరాటం చేశానని హదియా గుర్తు చేసింది. తాను గృహనిర్బంధానికి గురయ్యానని ఆమె వాపోయింది. తన జీవితంలో రెండేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు తనకు హాని తలపెడతారని తాను భావించడం లేదని, కానీ వారు కొంతమంది జాతి వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మారారని హదియా వ్యాఖ్యానించింది.