ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామినర్లకూ జంబ్లింగ్

09 January, 2018 - 7:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఇంట‌ర్మీడియట్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల్లో విద్యార్థులతో పాటు ఎగ్జామిన‌ర్లను కూడా జంబ్లింగ్ చేసే విధానాన్ని అమలు చేయాల‌ని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆదేశించారు. విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో మంగళవారం ఉదయం ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యద‌ర్శి బి. ఉద‌య‌ల‌క్ష్మి, ఇత‌ర ఉన్నతాధికారుల‌తో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లూ లేకుండా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల‌ని, పరీక్షా కేంద్రాల వ‌ద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి, కంప్యూట‌ర్ ద్వారా మానిట‌రింగ్ చేయాల‌ని అధికారులను ఆయన ఆదేశించారు.

ఎథిక‌ల్ అండ్ హ్యుమన్ వాల్యూస్ అంశానికి సంబంధించిన‌ ప‌రీక్ష నిర్వహించే రోజున ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్రధాన కార్యాల‌యం నుంచే ఆ ప్రశ్నాప‌త్రాన్ని ఇవ్వాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20న ప్రైవేటు, కార్పొరేట్ క‌ళాశాల‌ల మేనేజ్‌మెంట్లతో గంటా స‌మావేశ‌ం కానున్నారు. ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు, ఇత‌ర అంశాల‌పై ప‌లు సూచ‌నలు చేయ‌నున్నారు. ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల నిర్వహ‌ణ‌ విషయమై ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళతో మంత్రి గంటా ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

కాగా.. ఒంగోలు ఐఐఐటి క్యాంప‌స్‌కు స్థలం కేటాయింపుపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ చాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ రాజిరెడ్డి, వైస్ చాన్స్‌ల‌ర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇప్పటికే మూడు స్థాలాలను ప‌రిశీలించామ‌ని, త్వర‌లో దీనిపై త‌దుప‌రి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. ఐఐఐటీలో ఫ్యాక‌ల్టీ భ‌ర్తీ అంశం పైనా ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. ప్రస్తుతం జ‌రుగుతున్న విశ్వవిద్యాల‌యాల అధ్యాప‌కుల భ‌ర్తీ మాదిరిగా కొంత శాత‌మైనా శాశ్వత ప్రాతిప‌దిక‌న ఫ్యాక‌ల్టీని భ‌ర్తీ చేసేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని విద్యామంత్రి గంటా హామీ ఇచ్చారు.