జస్టిస్ లోయా మృతిలో అమిత్‌షా హస్తం?

13 January, 2018 - 8:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై సీపీఐ నేత నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులోవాదనలు వింటున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి లోయా మృతి కేసులో అమిత్ షా ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. నారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యాయ వ్యవస్థలో సంక్షోభం మొదలైందని నారాయణ అన్నారు. జడ్జి లోయాను చంపేశారని, కల్కాపూర్ న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకున్నారని, వేల కోట్ల రూపాయల మెడికల్ కుంభకోణం జరిగితే న్యాయమూర్తులను మార్చి కేసులను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు గురించి నారాయణ ప్రస్తావిస్తూ.. నిర్వాసితుల పునరావాసానికి రూ.32 వేల కోట్లు కావాలని, పునరావాస నిధులపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదని, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తానని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం బాధ్యతారాహిత్యమని సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.