రామ్‌ మందిర్ కూల్చింది మన ముస్లింలు కాదు!

16 April, 2018 - 2:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: అయోధ్యలోని రామ్‌ మందిర్‌‌ను ధ్వంసం చేసింది భారత దేశంలో ఉన్న ముస్లింలు కాదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదం కేసు మళ్లీ కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో భగవత్‌ ఇలాంటి అయోమయ వ్యాఖ్యలు చేయడం విశేషం. భారతదేశంలో ఉన్న ముస్లింలు ఇలా హిందూ దేవాలయాలపై దాడి చేయరని అన్నారు. భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారని చెప్పారు. పాల్‌గర్‌ జిల్లాకు పక్కనే ఉన్న దహానులో జరిగిన విరాట్‌ హిందూ సమ్మేళన్‌ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రామ్ మందిర్‌‌ను నిర్మించడం భారతజాతి కర్తవ్యమని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అయోధ్యలో ధ్వంసమైన రామ్ మందిర్‌‌ను తిరిగి అక్కడే పునర్నిర్మించే బాధ్యత మనపై ఉందన్నారు. దాని కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమన్నారు. రామ్ మందిరాన్ని పునర్నిర్మించకపోతే మన సంస్కృతి, సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. రామ్ మందిర్‌‌ను యథాస్థానంలో పునర్నిర్మిస్తామని మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పారు. ఈ రోజు మనం స్వతంత్రులమని, ధ్వంసమైన రామ్ మందిరాన్ని పునర్నిర్మించుకునే హక్కు మనకు ఉందని మోహన్ భగవత్ అన్నారు. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదని, మన ఐడెంటిటీకి గుర్తులని చెప్పారు.

దశాబ్దాలకు పైగా నడుస్తున్న రామ జన్మభూమి- బాబ్రి మసీదు వివాదం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వేసిన 13 అప్పీళ్లు ప్రస్తుతం సుప్రీంలో విచారణకు వచ్చాయి. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కుల ప్రాతిపదిక హింసకు ప్రతిపక్షాలను బాధ్యులను చేస్తూ మోహన్ భగవత్ విమర్శలు సంధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా కూర్చున్నవారే ఇలాంటి కుల హింస, కుల ఘర్షణలను ప్రేరేపిస్తున్నారని మోహన్‌ భగవత్‌ విమర్శించారు.