‘ఎవరో చెబితే జట్టును ఎంపిక చేయం’

13 January, 2018 - 12:59 PM

                                                               (న్యూవేవ్స్ డెస్క్)

సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో  సెంచూరియన్‌లో జరగనున్న రెండో టెస్ట్ పై కేప్ టౌన్ టెస్ట్ ఓటమి ప్రభావం తమపై ఏ మాత్రం ఉండబోదని విరాట్ కొహ్లీ స్పష్టం చేశాడు. తొలి టెస్ట్ కు ముందు తుది జట్టులో రహానే ఉండకూడదని అందరూ అన్నారని… వారం రోజుల్లోనే వారి అభిప్రాయాలన్నీ మారిపోయాయని చెప్పాడు. జట్టులో ఇప్పుడు రహానే ఉండాలని అంటున్నారని… ఎవరి అభిప్రాయాల మేరకో తాము జట్టును ఎంపిక చేయబోమని అన్నాడు. సెంచూరియన్ లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.

కేప్ టౌన్ లో తమ జట్టు ప్రదర్శన బాగానే ఉందని తెలిపాడు. ఆ టెస్ట్ నుంచి తాము ఎన్నో నేర్చుకున్నామని, రెండో టెస్టులో అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. సెంచూరియన్ పిచ్ తమ సామర్థ్యాన్ని పరీక్షిస్తుందని… సత్తా చాటేందుకు తాము కూడా సిద్ధంగానే ఉన్నామని తెలిపాడు.
కేప్ టౌన్ లో మన బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందని కోహ్లీ కితాబిచ్చాడు. సెంచూరియన్ లో కూడా వారు అదే స్థాయి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నట్టు తెలిపాడు. బ్యాట్స్ మెన్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని చెప్పాడు. కేప్ టౌన్ లో చేసిన పొరపాట్లను బ్యాట్స్ మెన్లు పునరావృతం చేయరాదని అన్నాడు. బ్యాట్స్ మెన్లు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పాడు. మన స్థాయి మేరకు ఆడితే చాలని అన్నాడు.