మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత!

16 April, 2018 - 12:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసులో నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు అసిమానంద, దేవేందర్ గుప్తా, భరత్, లోకేష్ శర్మ, రాజేందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులపై నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ.. కేసును కొట్టివేసింది. 11 సంవత్సరాల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడింది.

హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో 2007 మే 18న మధ్యాహ్నం 12 గంటలకు బాంబలు పేలాలి. ఆ పేలుళ్లలో 9 మంది మరణించారు. పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద ఈ కేసులో 11 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. మొత్తం 226 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు 2011లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించారు.

మక్కామసీదు ఆవరణలో ఆ రోజున ప్రార్థనలు జరుగుతున్న వేళ వజూఖానా వద్ద ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌‌ప్లోజివ్‌ డివైస్) బాంబును పేల్చడంతో 9 మంది మరణించారు. మరో 58 మంది గాయపడ్డారు. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. ఆపై ముస్లింలు నిరసనలు తెలుపుతుండగా, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ 2010 జూన్ 17 రాజస్థాన్‌‌కు చెందిన దేవేంద్రగుప్తా అలియాస్‌ బాబీ, మధ్యప్రదేశ్‌‌కు చెందిన లోకేశ్‌‌శర్మ అలియాస్‌ అజయ్‌ తివారిలను అరెస్ట్‌ చేశారు. అదే సంవత్సరం నవంబరులో కీలక నిందితుడు నాటకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద పోలీసులకు పట్టుబడడంతో మొత్తం ఘటన వెనక ఉన్న కుట్ర కోణం వెలుగు చూసింది.విచారణలో కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ, ఒక వర్గం ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మరో వర్గం పేలుళ్లకు పాల్పడుతోందనే కారణంతో మక్కామసీదు పేలుడు ఘటనకు పాల్పడినట్లు తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ, గుజరాత్‌‌లోని వల్సాద్‌‌కు చెందిన భారత్‌ మోహన్‌‌లాల్‌ రతేశ్వర్‌ అలియాస్‌ భారత్‌ భాయిని, మధ్యప్రదేశ్‌‌కు చెందిన రాజేందర్‌ చౌదరి అలియాస్‌ సముందర్‌‌లను కూడా అరెస్ట్ చేశారు. కేసులో ప్రమేయముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండోర్‌‌కు చెందిన సందీప్‌ వి డాంగే, రామచంద్ర కల్సంగ్రా రాంజీ అలియాస్‌ ఓమ్‌ జీలు ఇప్పటికీ పట్టుబడలేదు. మరో కీలక నిందితుడు సునీల్‌ జోషి హత్యకు గురయ్యాడు. ఇంత కాలానికి కేసు తీర్పు నిందితులకు అనుకూలంగా వెలువడటం గమనార్హం.