ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

13 March, 2018 - 4:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: పార్టీ ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేల కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఖాతరు చేయకుండా టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.కాగా.. పార్టీ ఫిరాయించి, మంత్రి పదవులు పొందిన ఎన్‌.అమర్‌‌నాథ్‌ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియలకు రాజ్యాంగం ప్రకారం ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని, వారి మంత్రి పదవులను రద్దు చేయాలని కోరుతూ రాంబాబు తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఫిరాయించిన వారు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హులు కారని, వారు ఒక్కొక్కరికీ రోజుకు రూ.500 చొప్పున పెనాల్టీ విధించాలని ఆయన తన పిటిషన్‌‌లో కోరారు.

ఈ వ్యాజ్యం తేలేవరకూ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కూడా న్యాయస్థానానికి రాంబాబు విజ్ఞప్తి చేశారు.