జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వంద కోట్ల ఆఫర్!?

16 May, 2018 - 2:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న ప్రలోభాల పర్వంపై జేడీఎస్‌ అధినేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, కేబినెట్‌ మంత్రి పదవులు ఆఫర్‌ చేస్తోందని, ఈ క్రమంలో అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బెంగళూరులోని ఓ హోటల్‌‌లో బుధవారం జరిగిన జేడీఎస్‌ శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ ఎల్పీ నాయకుడిగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి.. తన సోదరుడు హెచ్‌‌డీ రేవణ్ణతో కలిసి మాట్లాడారు. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జేడీఎస్‌‌లో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు.

అనంతరం కుమారస్వామి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘ఆపరేషన్‌ కమల్‌’ విజయవంతం అయిందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాతో రావడానికి సిద్ధంగా ఉన్నార’ని బాంబు పేల్చారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని కుమారస్వామి హెచ్చరించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు తెరతీసేలా గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు.

ఉత్తరాదిలో విజయవంతంగా సాగిన బీజేపీ అశ్వమేధ యాగానికి కర్ణాటకలో ఫుల్‌‌స్టాప్‌ పడిందని, బీజేపీ దుష్ట పన్నాగాలను అడ్డుకున్నాయని కుమారస్వామి వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కుమారస్వామి తెలిపారు. జేడీఎస్‌‌లో చీలిక వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు.ప్రధాని మోదీ ప్రచారం వల్ల బీజేపీకి 104 స్థానాలు రాలేదని, సెక్యులర్‌ ఓట్లు చీలడం వల్లే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ, బీజేపీ గెలుపు కాదని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత మంది ఎమ్మెల్యేల బలం లేకపోయినా కర్ణాటకలో అధికారం చేపడతామని నరేంద్ర మోదీ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అధికారం కోసం బీజేపీ వెంపర్లాడుతోందని, ప్రధాని మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేడీఎస్ పార్టీని చీల్చాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికార బలంతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని, ఐటీ దాడులు చేయిస్తూ.. వారిని ఆందోళనకు గురిచేయాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు.

బుధవారంనాడే రాష్ట్ర గవర్నర్‌ను కుమారస్వామి కలుసుకుని.. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు ఇచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. బీజేపీతో టచ్‌‌లో ఉన్నారని భావిస్తున్న దేవెగౌడ మరో కుమారుడు రేవణ్ణ కూడా జేడీఎస్‌ శాసనసభాపక్ష భేటీలో పాల్గొనడం గమనార్హం. జేడీఎస్‌‌లో ఎలాంటి చీలికా లేదని, పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని రేవణ్ణ తెలిపారు. ఇక ఈ భేటీకి ఇద్దరు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాలేదు.