ఢిల్లీ పర్యటనకు ఫిర్యాదులే కారణమా?

09 January, 2018 - 11:03 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మరోమారు తెరమీదకు వచ్చారు. ఆయన సోమవారం హఠాత్తుగా ఢిల్లీకి బయలుదేరడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ నరసింహన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా హోంమంత్రిని కలువనున్నారు. ఈ పర్యటన వెనుక రాజకీయపరమైన అంశాలు కూడా ఉండి ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ఇటీవలి కాలంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ సైతం గవర్నర్ తీరును తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ పనితీరుపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రంలోని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ పై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని…మళ్లీ చేస్తామని కూడా ఆయన ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా టూర్ వెనుక కారణం బీజేపీ నేతల ఫిర్యాదులేనా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు సైతం గవర్నర్ తీరును తప్పుపట్టిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకి వంతపాడేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అయితే…’కొత్త గవర్నర్ ను నియమించేందుకు బీజేపీలో గవర్నర్ అర్హత గల నేతలు ఎవరూ లేరా’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో గవర్నర్ ఢిల్లీ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్రపతితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ల సమావేశాని హాజరు అయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారని సమాచారం. ఇటీవల నియమించిన ఓ కమిటీ తాలుకూ నివేదికను రాష్ట్రపతికి అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా…సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గవర్నర్ నరసింహన్ మరోసారి సోమవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ కు గాంధీ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఐసీయూలో రోగులకు అందుతున్న సౌకర్యాలపై వైద్యుల వద్ద గవర్నర్ ఆరా తీశారు. 2017 ఆగస్టు నెలలో కుడికాలుకు ఉన్న ఆనె సమస్యకు గవర్నర్ సర్జరీ చేయించుకున్న విషయం విదితమే.