సర్కారు వారూ! ఇదెలా సరైన గో’దారి’!?

09 August, 2017 - 3:11 PM

కాళేశ్వరం (మేడిగడ్డ) నీళ్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి, బలం చేకూరుస్తామని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 10న ఈ పథకానికి శంకుస్థాపన చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రభుత్వం చెబుతున్నట్లు నిజంగా ఈ పథకం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునరుజ్జీవింపజేయవచ్చా? దీన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన పథకం ప్రకారం మేడిగడ్డ నుండి ఎల్లంపెల్లి-మిడ్‌మానేరు చిప్పకుర్తి-శ్రీరాంసాగర్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రవహింపజేయడానికి 300 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లు ఎత్తిపోయబోతున్నారు.

కాళేశ్వరానికి సుమారు 15 కిలోమీటర్లకు దిగువన గోదావరి నదిపై మేడిగడ్డ వుంటుంది. ఈ బ్యారేజీ ఎఫ్‌ఆర్ఎల్ 100 మీటర్లు. దీన్ని లోయర్ గోదావరి అంటారు. అన్నారం బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ 121 మీటర్లు. సుందిళ్ల బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ 132 మీటర్లు. వీటికి ఎగువన మంచిర్యాలకు సమీపంలో ఎల్లంపెల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్లు. ఎల్లంపెల్లి నుంచి రామడుగు, చిప్పకుర్తి వరకు నీళ్లను భారీ టన్నెళ్ళ గుండా ఎత్తిపోయవలసి ఉంటుంది. శ్రీరాంసాగర్ వరద కాలువ (ఫ్లడ్‌ఫ్లో కెనాల్) మొత్తం పొడవు 122 కిలోమీటర్లు అయితే చిప్పకుర్తి (99 కి.మీ) వద్ద వరద కాలువలో నీళ్లు ఎత్తిపోస్తారు. చిప్పకుర్తి వరద కాలువ గుండా 3 లిఫ్టుల ద్వారా శ్రీరంసాగర్‌కు 60 రోజులు 60 టీయంసీల నీళ్లు ఎత్తిపోయడం పథకం ఉద్దేశం.

ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించక ముందే ప్రఖ్యాత ఇంజినీరు టి.హన్మంతరావు మేడిగడ్డ నుండి శ్రీరాంసాగర్‌కు గోదావరి నీటిని నదీ గర్భం ద్వారా తరలించే బహుళ ప్రయోజనాలతో కూడిన పథకాన్ని సమగ్ర ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. నీటిపారుదల మంత్రి టి.హరీష్‌రావు హన్మంతరావు ఇంటికి వెళ్లి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని కూడా చెప్పారు. హన్మంతరావు అంచనా ప్రకారం ఈ పథకం వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 20 వేల కోట్ల రూపాయల ప్రజాధనం మిగులుతుంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి హన్మంతరావు పథకం ఎందుకు నచ్చలేదో వారే చెప్పాలి.

పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే అనేక ఉప నదులు గోదావరికి భారీగా నీటిని అందిస్తాయి, ఈ జలాల వినియోగానికి బ్యారేజీలు నిర్మించిన పక్షంలో గోదావరిలోనే నీరు ఎక్కడికక్కడ నిలువ ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఈ నీరంతటినీ కిందికి కాళేశ్వరం వరకూ పారనిచ్చి అక్కడ శ్రీరాంసాగర్‌లో ఎత్తిపోద్దామంటున్నది. ఇందులో హేతుబద్ధత ఎంతో వారే వివరిస్తే బావుంటుంది.

కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం కూడా “గోదావరి జలాల సమగ్ర వినియోగం” అనే పుస్తకంలో మ్యాప్‌లతో సహా టి.హన్మంతరావు ప్రణాళికనే స్థూలంగా సమర్థించారు. హన్మంతరావు ప్రతిపాదించిన పథకం ప్రకారం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే వరద నీటిని వినియోగించడానికీ, మధ్యలో ఇరువైపుల నుంచీ వచ్చి గోదావరిలో కలిసే అనేక ఉప నదులు, భారీ వాగుల ద్వారా లభ్యమయ్యే నీటిని వినియోగించుకోవటానికీ తగినన్ని బ్యారేజీలు గోదావరి నదిపై నిర్మించాలి. ముఖ్యంగా పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే అనేక ఉప నదులు గోదావరికి భారీగా నీటిని అందిస్తాయి, ఈ జలాల వినియోగానికి బ్యారేజీలు నిర్మించిన పక్షంలో గోదావరి లోనే నీరు ఎక్కడికక్కడ నిలువ ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఈ నీరంతటినీ కిందికి కాళేశ్వరం వరకూ పారనిచ్చి అక్కడ శ్రీరాంసాగర్‌లో ఎత్తిపోద్దామంటున్నది. ఇందులో హేతుబద్ధత ఎంతో వారే వివరిస్తే బావుంటుంది.హన్మంతరావు ప్రతిపాదించిన పథకం వల్ల ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఇందులో అన్ని బ్యారేజీలలో కలిపి అనేక పదుల టీఎంసీల నీరు నిల్వ ఉంచొచ్చు. నదీగర్భం భారీ జలాశయంగా మారుతుంది. ఈ నీటిని సాగు అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికీ, మత్స్య సంపద అభివృద్ధికీ వినియోగించవచ్చు. పారిశ్రామిక, పర్యాటక రంగ అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. ఈ బ్యారేజీల కింద ముంపునకు గురి అయ్యే భూమి మొత్తం నది గర్భ ప్రాంతం కాబట్టి భూసేకరణ అసలే అవసరం లేదు. పచ్చని పంటలు పండే భూమి ఏ బ్యారేజీలో ఒక్క ఎకరం కూడా మునగదు. నిర్వాసితుల సమస్య వుండదు. నష్టపరిహారం చెల్లించే అవసరం లేదు.

మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుండి జయక్వాడ్ వరకు నిర్మించిన పన్నెండు బ్యారేజీలలో బాబ్లీ ప్రాజెక్టు కూడా కలిసి వుంది. ఇలాంటి వరుస బ్యారేజీలనే శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుండి శ్రీరాంసాగర్ వరకు నిర్మించాలి. ఈ విధంగా నిర్మించడం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇరువైపుల వున్న విశాలమైన ఆయకట్టుకు, ఆ కింద పాత నల్గొండ జిల్లా వరకు గ్రావిటీ ద్వారా సాగునీరు సుస్థిరంగా అందించవచ్చు. మేడిగడ్డ (కాళేశ్వరం) నుండి ఎల్లంపెల్లి వరకూ కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే 3 బ్యారేజీలు నిర్మించాలని ప్రతిపాదించి, పనులు ప్రారంభించింది. అలా కాకుండా ఎల్లంపెల్లి నుండి శ్రీరాంసాగర్ వరుస సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఎన్ని బ్యారేజీలు అవసరమైతే అన్ని నిర్మించాలి. మేడిగడ్డ వద్ద లభ్యమయ్యే నీటిని హనుమంతరావు ప్రతిపాదించిన ప్రకారం తక్కువ ఖర్చు, తక్కువ దూరంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించవచ్చు.ఇక్కడి నుండి నిజాంసాగర్, సింగూర్‌లకు అయా నదీ గర్భాల గుండా ఎలాంటి ముంపు లేకుండా నీళ్లు తీసుకువెళ్లవచ్చు. ఈ ప్రక్రియనే “బహుళ ప్రయోజనాల స్టెవ్ లాడర్ టెక్నాలజీ” అని దశాబ్ధం క్రితం అన్నారు. ఇందులో ప్రతి బ్యారేజీ దగ్గర 12 మీటర్ల ఎత్తు నీళ్లు నిలువ వుండేలా పంపు చేయాలి. నౌకాయానానికి పనికి వచ్చే ప్రతి బ్యారేజీకి లాకును ఏర్పాటు చేసి, నది పొడవునా ఎక్కడైనా నీటిలోతు 4 మీ.కంటే తక్కువ వుండకుండా చూడాలి. నితిన్ గడ్కారీ ప్రాతినధ్యం వహిస్తున్న కేంద్ర నౌకాయాన రంగంలో ఒక లక్ష కోట్ల పైగా నిధులు ఉన్నాయి. దాని నుంచే ఈ బ్యారేజీల ఖర్చులకు నిధులు సమకూర్చుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఖర్చు తప్పుతుంది. ఇంత మంచి అవకాశం వున్నప్పుడు ఆ భారాన్ని తెలంగాణ ప్రజలపై వేయడమెందుకో సర్కారు పెద్దలు వివరించాలి.
ఈ అన్ని బ్యారేజీలలో నాగార్జున సాగర్‌లో మాదిరిగా రివర్సిబుల్ పంపులు పెట్టవచ్చు.

ఇవి దిగువ నుండి ఎగువ బ్యారేజీకి నీరివ్వాలన్నప్పుడు పంపులుగా పనిచేస్తాయి. నదిలో పై నుంచి వరద ప్రవాహం ఉన్నప్పుడు అవే పంపులు వరద నీటికి టర్బయిన్లుగా పనిచేసి జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అల్‌స్టామ్ అనే కంపెనీ ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 15 మీ. ఎత్తు దాకా ఉండే రివర్సబుల్ పంపులను ఇప్పటికే సరఫరా చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి గుండా శ్రీరాంసాగర్‌కు తరలించే నీటికి ఈపంపులను వాడి బహుళ ప్రయోజనాలు పొందవచ్చని హన్మంతరావు స్వయంగా ప్రభుత్వానికి వివరించారు. ఈ బ్యారేజీ పనులకు ఒక లైన్ ఎస్టిమేట్ వేసి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని హన్మంతరావు చేసిన సూచనలకు కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు హరీష్‌రావు స్వయంగా టి.హన్మంతరావుకు తెలియజేశారు. ఈ పథకాన్ని ఆమోదించినట్లే ఆమోదించి నితిన్ గడ్కారికి సమర్పిస్తామని చెప్పి ఊరించి చివరికి కొత్త పథకాన్ని బయటకు తీశారు. ఈ పథకంలో చాలా పెద్ద లోపాలు ఉన్నాయి. కుడి ఎడమల గల భారీ వాగులు, ఉపనదులు గోదావరి నదికి భారీనీటిని అందిస్తాయి. వరద కాలువలో అలాంటి ప్రకృతి సిద్ధమైన నదులు కలిసే వెసులుబాటు వుందా? ఎగువ నుంచి కాళేశ్వరం దిగువకు చేరిన తర్వాత అదే నీటిని మళ్లీ భారీ ఖర్చుతో ఎగువకు ఎత్తిపోసే అవసరం ఏమిటి? శాశ్వతంగా ఈ ఖర్చు తెలంగాణ సమాజంపై భారం కాదా?

హన్మంతరావు ప్రతిపాదించిన పథకం ప్రకారం, గోదావరి నదిలో ధవళేశ్వరం నుంచి కాళేశ్వరం, ఎల్లంపెల్లి, శ్రీరాంసాగర్‌ల మీదుగా త్రయంబకేశ్వర్ వరకు జలరవాణా సాధ్యమౌతుంది. కృష్ణా నదిలో ఇలాంటి అవకాశం అసలే లేదు. గోదావరిలో జలరవాణాతో తెలంగాణకు సముద్రం లేని లోటు తీరుతుంది. దీని ద్వారా అపారమైన ఆదాయంతో పాటు జలరవాణా ద్వారా మిగతా ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పడం సాధ్యమైతుంది. వరద కాలువకు అలాంటి అవకాశాలు అసలు లేవు.ఇదంతా అలా ఉండగా మరో ప్రధానమైన ప్రశ్నకు సమాధానం కూడా కావాలి. తుమ్మిడిహెట్టిని పక్కకు పెట్టి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం తలకెత్తుకున్న తర్వాత మేడిగడ్డ నీళ్ళను ఎల్లంపెల్లి, మిడ్‌మానేరు (320మీ) మీదుగా మల్లన్నసాగర్ (557 మీ) నుండి హల్ధి నది ద్వారా దిగువ శ్రీరాంసాగర్‌కు (310 మీ) తరలించే మొదటి పథకాన్ని ప్రకటించారు. ఇప్పుడు వరద కాలువ -శ్రీరాంసాగర్ రెండో లిఫ్టు ప్రతిపాదించారు కాబట్టి దానిని రద్దు చేస్తున్నారా లేక అది అలానే కొనసాగుతుందా? తామే స్వయంగా ముందు ప్రతిపాదించిన మల్లన్నసాగర్ రీడిజైనింగ్ (వయా హల్ది నది) పొరబాటేనని ఇప్పుడు ప్రభుత్వం పరోక్షంగా నైనా అంగీకరిస్తున్నట్లేనా?

– నైనాల గోవర్ధన్

తెలంగాణ జలసాధన సమితి నాయకులు
మొబైల్ :  9701381799