విడాకులకు ఆరునెలలు ఆగనక్కర్లేదు!

13 September, 2017 - 10:44 AM

 

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: హిందూ వివాహ చట్టం ప్రకారం  విడాకుల విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు తీసుకునేందుకు ఆరు నెలల రాజీ గడువును తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని సూచించింది. దంపతులకు ఒకేఇంటిలో నివసించే ఉద్దేశం లేకపోతే ఆ గడువును ట్రయల్ కోర్టు రద్దు చేయవచ్చని తెలిపింది.

హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు కోరుతూ ఏ జంట అయినా పిటిషన్ దాఖలు చేస్తే, వాళ్లిద్దరూ ఉమ్మడి అంగీకారం తెలిపినప్పటికీ విడాకుల మంజూరుకు ఆరు నెలల విరామం ఉండాలి. విడాకుల చట్టం సెక్షన్ 13బీ(2)లో ఈ నియమాన్ని పొందు పరిచారు. అయితే ఇది తప్పనిసరి కాదని సలహాపూర్వకమే అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దంపతులు కచ్చితంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాక వాళ్లిద్దరూ మళ్లీ కలవడానికి ఆసక్తితో లేరని కోర్టు భావిస్తే ఆరు నెలల విరామం అక్కర్లేకుండా అప్పటికిప్పుడే విడాకులు మంజూరు చేయవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఎనిమిదేళ్లుగా తాము విడివిడిగా ఉంటున్నామని, తమకు విరామ సమయం అక్కర్లేకుండా విడాకులు మంజూరు చేయాలని ఒక జంట దాఖలు చేసిన విడాకుల పిటిషన్ పై స్పందిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేసింది.