ప్రజలను ‘ముంచే’ ప్రభుత్వం!

04 July, 2017 - 11:55 PM

తెలంగాణలో నీటి పారుదల పనులు జరుగుతున్న 5 ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను భూసేకరణ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు ఎత్తిపోతల ప్రాజెక్టులు 1) డిండి ప్రాజెక్ట్ 2) సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 3) పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 4) బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్ట్ 5) కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం కొరకు రైతు వద్ద నుంచి భూసేకరణ చేసే సందర్భంలో, కొత్త భూసేకరణ చట్టం, ఆ చట్టంలో వున్న నిబంధనల పరిధి నుంచి మినహాయిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

2013 భూసేకరణ చట్టంలోని రెండు, మూడు ఛాప్టర్ల నిబంధనల నుంచి ఈ అయిదు ప్రాజెక్టులకూ మినహాయింపు ఇస్తూ జీవోలు జారీ చేశారు. ప్రాజెక్టు చేపట్టడం వల్ల అక్కడి ప్రజలపై ఎటువంటి సామాజిక ప్రభావం కలుగుతుందన్న అధ్యయనం భూసేకరణకు ముందు చేయాలని ఆ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ అయిదు ప్రాజెక్టులకూ ఆ నిబంధనల నుండి తాజా జీవోలు మినహాయింపు ఇస్తున్నాయి.

భూమి ఒక మౌలిక ఉత్పత్తి సాధనం. ఏ రకమైన మౌలిక సదుపాయాలకైనా, అభివృద్ధికైనా భూమే అత్యంత ప్రధానమైన వనరుగా వుంది. రైతుకు ఉన్న ఏకైక జీవనాధారం కొద్దో గొప్పో వున్న భూమి మాత్రమే. చిన్న తరహా భూఖండాలుగా మారిన మన దేశంలో చిన్న మడిచెక్కే  రైతు కుటుంబానికి బుక్కెడు బువ్వ పెట్టే ఆధారమైంది. దేశంలో బ్రిటీష్ భూసేకరణ చట్టమే (1894) స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత 2013 వరకు అమలులో వుంది. ఫలితంగా భూమి నుంచి బలవంతపు బేదాఖలుకు గురైన పదుల కోట్ల శ్రమజీవులు, మురికివాడల్లో నిరాశ్రయులుగా నగరాల్లో, పట్టణాల్లో చౌకకూలీలుగా మారారు.

కేసీఆర్ ప్రభుత్వం 5 ప్రధాన ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికై  చట్టాల్లో అనివార్యంగా అమలు చేయవలసిన నిబంధనల నుండి కూడా వాటిని మినహాయిస్తూ రైతుల భూములను వారి అభీష్టానికి విరుద్ధంగా భూసేకరణ పేర బలవంతంగా గుంజుకోవడానికి పథకాలను, పోలీసు బలగాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నది.

2013 తర్వాత రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు, ఆ చట్టాన్ని తుంగలో తొక్కి, రాష్ట్ర స్థాయిలో సవరణల పేరుతో- పేర్లు ఏమైనా కావచ్చు- ఏదో రూపంలో ‘రైతుల భూమును భారీ ఎత్తున కారుచౌకగా కొట్టేయడానికి సరికొత్త ఆదేశాలు, చట్టాలను తీసురావడం జరుగుతూనే వుంది. అందులో భాగంగానే, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలకు భిన్నంగా, 2013-కేంద్ర భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తొలుత 123 జీవో తీసుకు వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ జీవోను హైకోర్టు రద్దు చేసిన తర్వాత 2016 భూసేకరణ చట్టాన్ని తీసుకు వచ్చింది. ఈ రెండూ కేంద్ర భూసేకరణ చట్టం-2013 కు పూర్తిగా విరుద్ధమూ, వ్యతిరేకమూ, కేంద్ర చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడం మాత్రమే.

ప్రజానిరసనను లెక్కచేయని సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం భూసేకరణపై ఒక చట్టం చేసిన తర్వాత, ఏ రాష్ట్రమైనా అదే భూసేకరణపై ఒక చట్టం చేస్తే అది ముమ్మాటికీ చెల్లదు. అయినా 123 జీవో, 2016 తెలంగాణ భూసేకరణ చట్టాలను అక్రమంగా తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంతటితో ఆగకుండా కేసీఆర్ ప్రభుత్వం 5 ప్రధాన ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికై ఆ చట్టాల్లో అనివార్యంగా అమలు చేయవలసిన నిబంధనల నుండి కూడా మినహాయిస్తూ రైతుల భూములను వారి అభీష్టానికి విరుద్ధంగా భూసేకరణ పేర బలవంతంగా గుంజుకోవడానికి పథకాలను, పోలీసు బలగాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నది.

మా గోడు వినండి!

తెలంగాణ ప్రభుత్వం ఐదు సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుల భూసేకరణ కొరకు, ఆదరా బాదరాగా జారీ చేసిన ఆదేశాలు రైతుల పుట్టి ముంచేవే తప్ప మరొకటి కాదు. రైతులకు మేలు చేసే చట్టాలను ఆచరణలో నిర్జీవంగా మార్చి, గోడకు వేలాడే బొమ్మల్లా చేసి, ప్రాజెక్టులు, పరిశ్రమల పేర కారుచౌకగా భూమిని స్వాధీనం చేసుకుని, అభివృద్ధి పేరిట దోచుకోవడం తప్ప ఇందులో ఇంకేమీ లేదు. సర్వం కోల్పోతున్న నిర్వాసితులను అన్ని విధాలా ‘‘సామాజిక మదింపు చేయడం’’ అనేది భూసేకరణలో తప్పనిసరిగా, విధిగా అమలు చేయవలసిన చట్ట నిబంధన. రైతులను సంపన్నులను చేస్తానంటున్న కేసీఆర్ అలాంటి నిబంధనలను అమలు నుండి మినహాయించడమంటే రైతు నుండి భూములను గుంజుకోవడం కాక మరేమిటో చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించడానికి, భూములకు సాగునీరు అందించడానికి, నిర్వాసితులకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిబంధనలను మినహాయిస్తున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం గొప్పలు పోతోంది.

కోటి ఆశలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ప్రాజెక్టులు నిర్మిస్తామంటే గత 3 సంవత్సరాలుగా ఏ ప్రజలు అడ్డుపడ్డారు? జలయజ్ఞంలో, అంతకు ముందు నుంచీ నిర్మాణంలో వున్న అనేకానేక పెండింగు ప్రాజెక్టులను ఎందుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం లేదు? ఎక్కువ భాగం నిర్మాణం పూర్తయి, అతి కొద్ది భాగమే మిగిలి వున్న పదుల కొద్దీ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఎందుకు పూర్తిగా పక్కన పెట్టారు? పెండింగు ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించడం లేదు? అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలో ఎటువైపు చూసినా అలాంటి అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అద్భుతమైన ప్రాజెక్టులు అనేకం కనిపిస్తాయి. పాత మహబూబ్‌ నగర్‌ కూడా మరో పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా. ఇలాంటివి తెలంగాణ రాష్ట్రమంతటా వుంటాయి. ఈ పెండింగు ప్రాజెక్టులకు ఏ ప్రాధాన్యతా లేదు!

ముంపుకు గురవుతున్న నిర్వాసితుల నిరసన

రాష్ట్రంలో వున్న పార్టీలు, ప్రజాసంఘాలు, రచయితలు, నీటిపారుదల నిపుణులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలంతా కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ సుస్థిరత, శాశ్వతత్వం, భవితవ్యాలపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నా ఒక్కదానికీ సహేతుక జవాబులు ఇవ్వడం లేదు. అలాంటి అస్థిర ప్రాజెక్టులైన కాళేశ్వరం, మల్లన్నసాగర్‌లకు ఏకంగా రూ. 80,500 కోట్లు కేటాయించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. నిపుణుల అంచనాల మేరకు ఈ ప్రాజెక్టుల వ్యయం రెండు రెట్లు దాటుతుంది. అంటే ఒక్క కాళేశ్వరానికే దాదాపు తెలంగాణ రాష్ట్ర రెండు బడ్జెట్లంత ఖర్చు అవుతుందన్నమాట. ప్రఖ్యాత ఇంజనీరు, నీటి నిపుణుడు టీ.హనునుమంతరావు ప్రతిపాదించిన, తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని గోదావరి నదికి అనుసంధానించే అతితక్కువ ఖర్చుతో పూర్తయ్యే  ప్రాణహిత సుందిళ్ల (గోదావరి) గ్రావిటీ కాలువను, లైడార్‌ హెలికాప్టర్ సర్వే చేసినప్పటికీ, అది కేసీఆర్ ప్రభుత్వం కంటికి మాత్రం కనబడడం లేదు.

కృష్ణానదిలో నికర జలాల గ్రావిటీ ప్రాజెక్టులకే కనీస నీరు రావడం లేదు. కరువుతో కృష్ణా బేసిన్ విలవిల్లాడుతోంది. ఆంధ్ర, తెలంగాణల్లోని గోదావరి నది నుంచి కృష్ణానది బేసిన్‌కి తరలించే నీళ్ల వల్ల గత ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారం ఎగువ కృష్ణాపై ప్రాజెక్టులు ముమ్మరంగా కట్టి నీటిని ఆపుకోవడం ఇప్పటికే మొదలైంది. అనావృష్టి ఒకవైపు, క్రౌడెడ్ డ్యామ్స్ మరోవైపు… ఇలా కరువు ముదిరిన కృష్ణాపై నిర్మించే మొత్తం మిగులు జలాల తెలంగాణ ప్రాజెక్టుల గతి ఏమౌతుంది? కొన్ని అస్థిర  ప్రాజెక్టుల కొరకు ప్రభుత్వమే నిబంధనలను ఎత్తివేసి చేసే ఇలాంటి భూసేకరణ భవితవ్యం ఏమిటి? రైతులను బలప్రయోగంతో నిలువునా ముంచడం, కాంట్రాక్టర్లు, నాయకులు, ఇంజనీర్లు భారీ వాటాలు పంచుకోవడం తప్ప ఇందులో ఏమీ లేదు. ఏ ప్రభుత్వమూ ప్రజలంటే ఇంత లెక్కలేకుండా వ్యవహరించడం ఉండదు.

తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయవలసిన అనేక పెండింగ్ ప్రాజెక్టులను మూలన పడేసింది. వేలూ, లక్షల కోట్ల రీడిజైనింగ్‌ కొత్త అస్థిర కలల ప్రాజెక్టులు వేగంగా ముందుకు వస్తున్నాయి. ‘అధిక లాభాలు’ పంచే అలాంటి అస్థిర ప్రాజెక్టులను వందలాది పోలీసు బలగాలు, ప్రత్యక్ష(లైవ్) కెమెరాల నిఘా మధ్య, ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రుల నిరంతర పనుల పర్యవేక్షణతో నిర్మించడం జరుగుతున్నది. తెలంగాణ మొత్తానికి ఎనలేని మేలు చేసే ప్రాణహిత`సుందిళ్ల గ్రావిటీ కాలువపై, కొద్దిపాటి నిధులతో లక్షల ఎకరాలకు నీళ్లందించే పెండింగు ప్రాజెక్టులపై కనీస శ్రద్ధ లేదు! కానీ ప్రపంచంలోనే భారీ అస్థిర ఎత్తిపోతల ప్రాజెక్టుల కొరకు, రైతుల సుస్థిర జీవితాలనూ, చట్టాలనూ ముంచుతూ చేసే భూసేకరణపై పాలకులకు అమిత ఆసక్తి  వుండడం తెలంగాణ జనుల దరదృష్టం కాదు… తమ దురదృష్టాలను దూరం చేస్తారని ఆశించిన ప్రజల ఆశల వమ్ము మాత్రమే.

– నైనాల గోవర్ధన్

(తెలంగాణ జలసాధన సమితి నాయకులు ; మొబైల్ 9701381799)