పూర్తయిన చేప ప్రసాదం పంపిణీ

09 June, 2018 - 11:57 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌‌లో ఉచితంగా చేసే చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు సమాచారం. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఉన్నారు. క్యూ లైన్‌‌లో వేచి ఉన్న వారికి మధ్యాహ్నం 12 గంటల వరకూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్‌‌బౌలిలోని తమ ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు.

చేప ప్రసాదం కోసం ప్రతి ఏటా మాదిరిగానే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్ తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీ చేసే కౌంటర్ల వద్ద క్యూలైన్లను, భారగా తరలివచ్చే వారిని నియంత్రించడం కోసం సుమారు 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ బిక్షంరెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌‌లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది వచ్చారు. గత ఏడాది 59 వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75 వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా చేప మందు పంపిణీ జరిగింది. పోలీస్‌ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌‌లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు.