తెలంగాణ వాసులపై గోవాలో హత్య కేసు

12 January, 2018 - 9:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పణజి: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తెలంగాణకు చెందిన 15 మంది పర్యాటకులు తాము బస చేసిన గెస్ట్‌హౌస్ సిబ్బందిపై దాడి చేశారు. దీంతో వారిప్పుడు హత్యకేసును ఎదుర్కొంటున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా వీరు దాడి చేసినట్టు భావిస్తున్న జయేష్ భండారి అనే వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు వీరిపై హత్యకేసు నమోదు చేశారు. ఈ నిందితులంతా ఇప్పుడు కొల్వాలెలోని సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. దాడి ఘటన జరిగిన రాత్రే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొత్త సంవత్సరం వేడుకలను ఆనందంగా నిర్వహించుకుకునేందుకు 15 మంది తెలంగాణ పర్యాటకులు గోవా వచ్చారు. ఈ నెల 1వ తేదీ రాత్రి కలన్‌‌గుటె గెస్ట్‌‌హౌస్‌‌లో బస చేసిన వారు ఓ చిన్న విషయమై గెస్ట్‌‌హౌస్‌ సిబ్బందితో గొడవకు దిగినట్టు సమాచారం. తెలంగాన పర్యాటకులు దాడి చేయడంతో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి, మినీ బస్సును స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. ఈ దాడి ఘటనలో గాయపడిన జయేష్‌ భండారి తాజాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో నిందితులపై నమోదు చేసిన హత్యాయత్నం కేసును హత్యకేసుగా మార్చి.. దర్యాప్తు చేపడుతున్నట్టు స్థానిక ఇన్‌స్పెక్టర్‌ జివ్‌బా దల్వి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటికే హత్య అభియోగాలను చేర్చామని, మరింత విచారణ కోసం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని ఇన్‌‌స్పెక్టర్‌ దల్వి వెల్లడించారు.