ఫాదర్ టామ్‌కు విముక్తి : సుష్మా ట్వీట్

12 September, 2017 - 6:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: గతేడాది యెమెన్‌లో కిడ్నాప్‌కు గురైన కేరళ క్రైస్తవ పూజారి ఫాదర్ టామ్‌ ఉజునలిల్‌‌కు ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. ప్రస్తుతం ఆయనను మస్కట్‌కు తరలించినట్లు యెమెన్ అబ్జర్వర్ తెలిపారు. ఫాదర్‌ టామ్‌ను విడిపించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మంగళవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టామ్ మంగళవారం రాత్రికి కేరళ చేరుకుంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

2016 మార్చిలో యెమన్‌లోని అడెన్‌ నగరంలో ఉన్న మదర్ థెరిసా మిషనరీస్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు భారతీయులు సహా 16 మందిని అతి దారుణంగా చంపేశారు. మరికొందరిని కిడ్నాప్ చేశారు. అందులో టామ్‌ కూడా ఉన్నారు.

గత మే నెలలో సాయం కోసం అర్థిస్తున్న టామ్ వీడియో ఒకటి మీడియాలో ప్రసారమైంది. ‘నా ఆరోగ్య క్షిణిస్తోంది. నేను వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. నాకు సాయం చేయండి’ అని కోరారు. కిడ్నాపర్లు తమ డిమాండ్లను చెప్పేందుకు భారత ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు టామ్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు.