ఆడబిడ్డకు జన్మనిచ్చిన అవ్వ..!

09 June, 2018 - 10:58 AM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: సైన్స్ చేసే వింతలకు కొదవేముంది. తిమ్మిని బమ్మిని చేయగలదు. బమ్మిని తిమ్మినీ చేయగలదు. కాకపోతే దానికి ఓ రీజన్ ఉంటుంది. ఇలాంటి సంఘటనే తమిళనాడు రాజధాని చెన్నైలో తాజాగా జరిగింది. మెనోపాజ్ దశ దాటిపోయి దశాబ్దం గడిచిపోయిన ఓ పెద్ద వయస్కురాలు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఈ సైన్సే కల్పించింది.

విషయం ఏమిటంటే.. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా గోబిచెట్టిపాళయంకు చెందిన వారు సెందమిళ్‌ సెల్వి (63), కృష్ణన్‌ (71) దంపతులు. వీరికి వివాహమై సుమారు 42 ఏళ్లయినా సంతానం కలగలేదు. సంతానం కోసం వారు అనేక ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో చివరిగా ఆ వృద్ధ దంపతులు పళని బాలాజి ఫర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారు. వారిని పరీక్షించిన ఫర్టిలిటీ సెంటర్ వైద్యులు 63 ఏళ్ల ఆ మహిళకు టెస్ట్‌ట్యూబ్‌ చికిత్స ద్వారా సంతాన ప్రాప్తి కలిగించి రికార్డు సృష్టించారు.

ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటుచేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పళని బాలాజీ ఫర్టిలిటీ సెంటర్ మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సెందామరై సెల్వి, చికిత్స అందుకున్న మహిళ సెందమిళ్‌ సెల్వి, ఆమె భర్త కృష్ణన్‌ పాల్గొన్నారు.

డాక్టర్‌ సెందామరై సెల్వి మాట్లాడుతూ.. ఈ వృద్ధ దంపతులు తమ ఆస్పత్రికి రెండేళ్ల క్రితం వచ్చారన్నారు. సెందమిళ్ సెల్వికి మెనోపాజ్‌ నిలిచిపోయి 10 ఏళ్లయినా.. పరీక్షలు నిర్వహించి గర్భధారణ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమె ఆధునిక టెస్ట్‌ట్యూబ్‌ బేబీ చికిత్స ద్వారా గర్భం దాల్చడంతో నిరంతరం పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఆమె ఇటీవల 3.25 కిలోల బరువైన ఆడశిశువుకు జన్మనిచ్చిందన్నారు. సెందమిళ్‌ సెల్వి, కృష్ణన్‌ దంపతులు డాక్టర్‌ సెందామరై సెల్వికి కృతజ్ఞతలు తెలిపారు.