భావ సంఘర్షణలు లేని విద్యాలయాలా!?

17 July, 2017 - 8:35 PM

విశ్వవిద్యాలయాలలో పేరుకు తగ్గట్టే విశ్వవ్యాప్తంగా జరిగే ఘటనలపై చర్చలు జరుగుతాయి. చర్చలు కొన్నిసార్లు అసంపూర్తిగా ఆగిపోతాయి. ఆగిపోయిన చర్చలు కొనసాగుతాయి. ఆ చర్చల నుంచి చర్చలు వస్తాయి. కొన్ని సందర్భాలలో ఒక చర్చకు కొనసాగింపుగా చర్యలు పుడతాయి. ఆలోచన భౌతిక రూపం ధరించిన పోరాటం అవుతుంది.

అక్కడ మెదళ్ళు సంఘర్షించుకుంటాయి. ఆలోచనలు పరస్పరం ఢీకొంటాయి. అక్షరాలు, పుస్తకాలలో పుటలు సంఘర్షించుకుంటాయి. ఈ భావ సంఘర్షణలే పూలలా వికసిస్తాయి. విజ్ఞాన సౌరభాలు వెదజల్లుతాయి. విశ్వవ్యాపితమవుతాయి. తరతరాల ఈ అనుభవం తెలంగాణా గడ్డకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ తెలంగాణాలోనే భావాలు సంఘర్షించటంపై నిషేధపు కత్తి వేలాడుతున్నది.

విద్య జ్ఞాన సంపదను పంచుతుంది. ఆ సంపద జాతులనూ, సమూహాలనూ విముక్తి బాటలో నడిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ యూనివర్సిటీలన్నీ జ్ఞానాన్ని అందించినవే. వైయక్తిక ప్రయోజనాలకు ఉపయోగపడే జ్ఞానాన్నే కాదు.. సమాజంలోని సమస్త ప్రజలకు ఉపయోగపడే జ్ఞానాన్ని యూనివర్సిటిలు విద్యార్థులకు అందించాయి. అందిస్తున్నాయి.

యూనివర్సిటీలలో రాజకీయాలు అవసరమా అనే చర్చ చాలా కాలంగా నడుస్తూ ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తినప్పుడు, ఆ ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర గణనీయంగా  ఉన్న ప్రతిసారీ ఈ చర్చ తలెత్తుతుంది. తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటి ఈ తరహా సజీవ రాజకీయ స్పందనలకు మొదటి నుంచీ నెలవు.

ఇపుడు తెలంగాణా పాలకులకు ఆ చైతన్యమే కంటగింపుగా మారింది. ‘యూనివర్సిటీల్లో సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వకండి. తెలంగాణ వచ్చి మూడేండ్లు గడిచాయి. ఇక విద్య, పరిశోధనలపై దృష్టి పెట్టండి’ అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వైస్ ఛాన్సలర్ల సమావేశంలో అన్న మాటలకు మరో అర్ధం వెతకనక్కరలేదు.

విద్యార్థులు రాజకీయ చైతన్యం కలిగి ఉండడం ప్రభుత్వాలకు, పాలకులకు సహించదు. యూనియన్ ఎన్నికలు ఉండడం వల్ల విద్యార్థులు చైతన్యవంతంగా మారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటూ విద్యార్ధి సంఘాల ఎన్నికలను నిషేధించిన తెలుగుదేశం పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. విద్యార్థులు రాజకీయాలు చేయడానికి సామాజిక శాస్త్రాలు చదవడం కారణం అంటూ సామాజిక శాస్త్రాలను నిషేధించాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రి. యూనివర్సిటీలు రాజకీయాలకు నెలవు కారాదు అని ఆయన వాఖ్యానించడంలో ఆశ్యర్యం ఏమీ లేదు.విద్యార్థుల పని కేవలం విద్యను అభ్యసించడమే కాదు, నేర్చుకున్న విద్యను సమాజానికి అన్వయించటం కూడా. సభ పెట్టుకునే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు విషయంలో రాజ్యాంగం ప్రజలకు హామీ పడింది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు అన్నవారికి భగత్ సింగ్ మాటలు గుర్తు చేయడం బాగుంటుంది. పంజాబ్ విద్యార్థుల సమావేశానికి పంపిన సందేశంలో ఆయన ‘యువత దేశంలో ప్రతిమూలకు విప్లవ సందేశాన్ని  తీసుకువెళ్ళాలి. పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించే బస్తీల ప్రజలను, గ్రామాల్లో ఉండే  కోట్లాది ప్రజలను మేల్కొలపాలి. వారిని పోరాటానికి సమాయత్తం చేయాలి. తద్వారా మనిషిని మరొక మనిషి పీడించే స్థితి అంతమవుతుంది’ అంటాడు.

యూనివర్సిటీలు రాజకీయాలకు కేంద్రంగా మారితే వచ్చే పరిణామాలు పాలకులకు ఇష్టం ఉండదు. తెలంగాణలోని యూనివర్సిటీల చరిత్రను తడిమి చూస్తే.. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే అవి సామాజిక మార్పులో పోషించిన పాత్ర అర్థమవుతుంది.

ఉస్మానియా యూనివర్సిటీని ఎందుకు ‘ఉద్యమాల పురిటిగడ్డ’ అన్నారు? కాకతీయ యూనివర్సిటీని ‘కారల్ మార్క్స్ యూనివర్సిటీ’ అని ఎందుకు అన్నారు? వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా ‘రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్’ అయింది. మెస్ కార్మికుడు యాదగిరి ఎందుకు పోరుబాట పట్టాడు? ఎందుకు మాయం అయ్యాడు? యూనివర్సిటీల్లో ఉండాల్సిన విద్యార్థులకు పల్లెలకు, మరీ ముఖ్యంగా వాడలకు ఎందుకు తరలి వెళ్లారు?

ఇవేం జవాబులు లేని ప్రశ్నలు కాదు. విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యను, జ్ఞానాన్ని సమాజంలో మార్పుకు అన్వయించారు. అట్లా అన్వయించడమే విద్యా సముపార్జన లక్ష్యం అని నమ్మారు. నమ్మిన దాన్ని ఆచరించారు. ప్రజలను చైతన్య పరిచారు. చైతన్య పరచడం బాధ్యతగా భావించారు. ప్రజలకు వారి హక్కులను తెలియజెప్పారు. అది సహజంగానే పాలకులకు నచ్చదు. నచ్చకపోవడమే పాలకవర్గ స్వభావం.

ఇవాళ పాలకుల లక్ష్యం ‘డిపొలిటైజేషన్‌ ఆఫ్‌ క్యాంపస్‌’. అందుకు విద్యార్థి సంఘాల ఎన్నికలను నిషేధిస్తారు. యూనివర్సిటీల్లో రాజకీయ కార్యక్రమాలను నిషేధిస్తారు. యూనివర్సిటిలో ప్రశ్నించే వ్యక్తులు, శక్తులు లేకుండా చేస్తారు. యూనివర్సిటీలలో రాజకీయ కార్యకలాపాలు తగ్గిపోయాక, వాటిని మూసేసినా అడిగే చైతన్యం కొడిగట్టుకుపోయాక యూనివర్సిటీలను మూసేసి వాటి స్థానంలో ప్రైవేటు యూనివర్సిటీలు తెరుస్తారు.

ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఇప్పుడు యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు, బోధిస్తున్న అధ్యాపకులపై మరింత ఎక్కువ బాధ్యత ఉంది. మన ముందు తరం పోరాడి ఈ యూనివర్సిటీలను పాలకుల దుష్టపన్నాగాల నుంచి కాపాడి మనకు అందించిందనే స్పృహ అందరిలోనూ రావాలి. మనం చదివే చదువు, సంపాదించిన జ్ఞానం మన జాతుల విముక్తికి ఉపయోగపడకపోతే దానికి అర్థం లేదు.

అరుణాంక్
రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి
డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్