రాహుల్‌పై రిషి కపూర్ సెటైర్లు

13 September, 2017 - 12:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ సెటైర్లు వేశారు. రాహుల్ రెండు వారాల అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రసంగిస్తూ.. భారత్‌లో వారసత్వ రాజకీయాలు మాములేనని వ్యాఖ్యానించారు. కేవలం నేనొక్కడినే రాజకీయ వారసత్వం చేయడం లేదు. అఖిలేష్ యాదవ్, స్టాలిన్, చివరకు సినిమాల్లో అభిషేక్ బచ్చన్, వ్యాపార రంగంలో అంబాని కుమారులు.. వీరందరూ వారసత్వం నుంచి వచ్చిన వారేనని రాహుల్ ప్రస్తావించారు.

ఈ కామెంట్లపై రిషి కపూర్ వరుస ట్వీట్లతో రాహుల్‌పై మండిపడ్డారు. ‘రాహుల్‌.. 106 ఏళ్ల ఇండియన్ సినిమా పరిశ్రమలో కపూర్ల కుటుంబానికి 90 ఏళ్లుగా భాగస్వామ్యం ఉంది. వారిలో ఒక్కో తరం నటుడిని ప్రేక్షకులే ఎంచుకున్నారు. దేవుడి దయవల్ల మా కపూర్‌ కుటుంబంలో నాలుగు తరాలు సినిమా పరిశ్రమలో ఉన్నాయి. కాబట్టి వారసత్వ రాజకీయాలంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. కష్టపడి ప్రజల గౌరవాన్ని, ప్రేమను సంపాదించుకొండి, కానీ బలవంతంగా, గూండాగిరీతో కాదు’ అని రిషి కపూర్ పేర్కొన్నారు.