పావు గంటలోనే ఇకపై రైతు పాస్‌పుస్తకం..!

12 September, 2017 - 9:03 PM

(న్యూవేవ్స్ ప్రతినిధి)

అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి దురిస్ధితి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం కే ఈ కష్టమూర్తి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు వాస్తవాలను విస్మరించి, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గడచిన మూడేళ్ళలో ఏ శాఖలోనూ చేపట్టని సంస్కరణలు రెవెన్యూ శాఖలో ప్రవేశపెట్టామన్నారు.

సామాన్య రైతులు పాస్‌పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ సేవలో 25 రూపాయలు చెల్లించి పావుగంటలోనే పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ పొందే విధంగా వెసులుబాటు కల్పించామని కేఈ అన్నారు. టైటిల్ డీడ్, పాస్‌పుస్తకం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొనే విధంగా మీ భూమి వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ‘భూ శోధక్’ అనే ఆండ్రాయిడ్ యాప్ రూపొందించి పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ నిజమైనదా కాదా అనేది తెలియజేసే QR స్కానింగ్ టూల్‌ని విడుదల చేశామని తెలిపారు.

చుక్కల భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వం GO.MS no. 298, తేదీ: 17. 7.2017న ఇచ్చామని కేఈ చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 24 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు భరోసా కల్పించేలా 100 గజాలలోపు ప్రభుత్వ స్ధలాలు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న పేదలకు (BPL కుటుంబాలకు) ఉచితంగా స్ధలాలను క్రమబద్ధీకరించామమన్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 286 మంది లబ్ధి పొందారన్నారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న గాజువాక భూముల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. సర్వే అభ్యర్ధనలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 623 ETS, 9 DGPS మెషీన్లు సమకూర్చామని కేఈ తెలిపారు. వీటి వినియోగంపై ఇప్పటి వరకు 2 వేల 109 రెగ్యులర్, లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

విద్యార్ధులు తమకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘విద్యార్ధుల సేవలో- రెవెన్యూ శాఖ’ పేరుతో కళాశాలలకే వెళ్లి సర్టిఫికేట్లు అందజేశామన్నారు. రెవెన్యూ శాఖ చరిత్రలో మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 105 తహశీల్దార్ బిల్డింగ్‌లు, 8 RDO ఆఫీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 9 అర్బన్ మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. విశాఖపట్నంలో 3, విజయవాడలో 3, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లో ఒక్కో అర్బన్ మండలం ఏర్పాటు చేయబోతున్నట్లు కేఈ వెల్లడించారు.

2017-18 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ శాఖకు రూ.4 వేల కోట్లు లక్ష్యాంగా నిర్దేవించినట్లు కేఈ తెలిపారు. ఆగస్టు నెల వరకు నిర్దేశిల లక్ష్యాలను అధిగమించినట్లు పేర్కొన్నారు. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేశామన్నారు. అవసమైతే సిట్ కాలపరిమితిని మరింత పెంచుతాని చెప్పారు. విశాఖ ఆర్డీఓపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు కేఈ వెల్లడించారు. సామర్లకోటలో తాత్కాళిక రెవెన్యూ, సర్వే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాలా ఛార్జీల తగ్గింపు అంశం గవర్నర్ పరిధిలో ఉందన్నారు.