దుర్గమ్మ భక్తులకు దసరా బాదుడు?

09 September, 2017 - 3:37 PM

(న్యూవేవ్స్ ప్రతినిధి)

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఈ ఏడాది కూడా దసరా బాదుడు తప్పట్లేదు. అమ్మను సేవించుకోవాలంటే వేలాది రూపాయలతో టిక్కెట్లు కొనాల్సిందే. గత ఏడాది భారీగా పెంచిన టిక్కెట్ ధరలపై విమర్శలు వెల్లువెత్తినా ఈ ఏడాది కూడా అదే బాటలో నడిచేందుకే దుర్గగుడి అధికారులు సిద్ధమయ్యారు. దసరా నవరాత్రి ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ అని పేరుకు ప్రకటించినా నిధుల కేటాయింపులో మొండిచేయి చూపుతున్న ప్రభుత్వ వైఖరి భక్తులపై భారం పడడానికి కారణమవుతోంది.

విజయవాడలోని కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నిత్యం నిర్వహించే పూజలకు సంబంధించిన టిక్కెట్టు ధరలను తగ్గిస్తారని ఆశించిన భక్తులకు ఈ ఏడాది కూడా నిరాశే ఎదురయ్యింది. వేలాది రూపాయలతో గత ఏడాది పెంచిన సేవా టిక్కెట్ల ధరలను యథావిధిగానే కొనసాగించాలని దుర్గగుడి అధికారులు, పాలకమండలి కూడా నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అమ్మవారికి నిత్యం నిర్వహించే కుంకుమ పూజలకు నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. భక్తులు నవరాత్రుల్లో కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సాధారణ రోజుల్లో కుంకుమ పూజకు వెయ్యి రూపాయలు టిక్కెట్టు ఉంటే, దసరా ఉత్సవాల సందర్భంగా దానిని మూడు వేల రూపాయలకు పెంచారు. సరస్వతీదేవి రూపంలో అమ్మవారు కనిపించే మూలా నక్షత్రం రోజున ఇదే పూజకు అయిదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ టిక్కెట్టు రేట్లు కేవలం దసరా ఉత్సవాల వరకు మాత్రమే అని అధికారులు చెబుతున్నారు.

మూలా నక్షత్రం రోజున మూడు షిఫ్ట్‌లలో 750 మంది దంపతులు కుంకుమార్చనలో పాల్గొనవచ్చని, మిగిలిన రోజుల్లో రెండు షిఫ్ట్‌లలో అయిదు వందల మందికి అవకాశం కల్పిస్తున్నామని దుర్గ గుడి ఈఓ సూర్యకుమారి, చైర్మన్ గౌరంగబాబు తెలిపారు. దసరా ఉత్సవాల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని కుంకుమార్చన చేయించుకునే భక్తులకు ఈ భారీ టిక్కెట్ల వడ్డన భారంగా మారుతోంది. అమ్మవారికి నిత్యం నిర్వహించే చండీయాగానికి మామూలు రోజుల్లో వెయ్యి రూపాయలు టిక్కెట్టుగా ఉండగా, దసరా ఉత్సవాల సమయంలో దానిని నాలుగు వేల రూపాయలకు పెంచారు. దీనిపైన కూడా భక్తులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. అధికారులు మాత్రం దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నందున ఆదాయం కోసం ఈ టిక్కెట్టు రేట్లను తగ్గించడం లేదని చెబుతున్నారు.
దుర్గగుడి పాలకమండలి కూడా గత ఏడాది భారీగా పెంచిన టిక్కెట్టు రేట్లపై కొంత అసహనంగా ఉంది.

మ్మవారి దర్శనం కోసం మూడు వందలు, వంద రూపాయలుగా ఉన్న టిక్కెట్లు ధరలు కూడా తగ్గించాలని పాలకమండలి గతంలోనే అభిప్రాయపడింది. ఇప్పుడు దసరా ఉత్సవాలు దగ్గర పడుతుండటంతో సేవా టిక్కెట్లతో పాటు, దర్శన టిక్కెట్టు రేట్లను సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులను పాలకమండలి సమావేశంలో కోరింది. కేవలం దర్శనం టిక్కెట్టును మాత్రం మూడు వందల నుంచి నూట యాబైకి, వంద రూపాయల నుంచి యాబై రూపాయలు తగ్గించేందుకే అధికారులు అంగీకరించారు. దీనిపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కానీ సేవా టిక్కెట్ల రేట్లను తగ్గించేందుకు అధికారులు ససేమీరా అనడంపై పాలకమండలి నిస్సహాయంగా ఉండిపోవడం విమర్శల పాలవుతోంది.

మరోవైపు దర్శనం టిక్కెట్లు రేట్లను తగ్గిస్తున్నామంటున్న అధికారులు సేవా టిక్కెట్లపై మాత్రం నోరు మెదపకపోవడం పట్ల సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల్లో టిక్కెట్టు ధరలు తగ్గించి, వేలల్లో ఉన్న రేట్లపై స్పందించకపోవడం ఏమి సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా దసరా పండుగను నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులపై భారం పడేలా ఎందుకు టిక్కెట్లు రేట్లను పెంచుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాన్య భక్తులు అమ్మవారి సేవా పూజల్లో పాల్గొనాలంటే జేబు గుల్ల చేసుకోవాల్సిందేనా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.