ఢిల్లీ ఎల్జీ నివాసం వద్ద కేజ్రీవాల్ నిరసన

12 June, 2018 - 12:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం వద్ద రాత్రంతా వెయిటింగ్ హాలులో ఉన్న సోఫాలోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిద్రపోయారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో మంగళవారం రెండో రోజు కూడా ఆయన తన నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ వాసులకు రేషన్ వారి ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలన్న తన నిర్ణయానికి ఆమోదం తెలపాలని, నాలుగు నెలలుగా విధులకు హాజరు కాని ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీటిపై మాట్లాడేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నివాసానికి వెళ్లి కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ కోసం రెండో రోజు కూడా వేచిచూస్తున్నారు.

సోమవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రులు సత్యేంద్రకుమార్ జైన్, గోపాల్‌‌రాయ్‌‌లతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లిన కేజ్రీవాల్ ఎల్జీ అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో రాత్రంతా అక్కడి వెయిటింగ్ హాల్‌లోనే కూర్చుండిపోయారు. అక్కడున్న సోఫాపై రాత్రి నిద్రపోయారు. అక్కడికే ఆహారం కూడా తెప్పించుకుని తిన్నారు. మధుమేహ వ్యాధి ఉండటంతో ఇన్సులిన్ ఇంజక్షన్‌ను కూడా అక్కడే తీసుకున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ నిరసన రెండో రోజుకు చేరినప్పటికీ గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి పిలుపూ రాలేదని సమాచారం వస్తోంది. గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఢిల్లీ సీఎం ఎల్జీని బెదిరిస్తున్నారని, ఎలాంటి కారణం లేకుండానే ఆయన అకస్మాత్తుగా నిరసనకు దిగారని ఆరోపించడం విశేషం.