ఢిల్లీలో కొనసాగుతున్న కేజ్రీవాల్ ధర్నా

13 June, 2018 - 2:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్ వద్ద సోమవారం సాయంత్రం ధర్నా ప్రారంభించిన సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ మూడో రోజు బుధవారం కూడా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు ధర్నా ఆపేది లేదని బీష్మించుకుని రాజ్‌భవన్ వెయిటింగ్ హాల్‌లోనే కూర్చున్నారు. ప్రజలకు రేషన్‌ సరకులను డోర్‌ డెలివరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలంటూ సీఎం కేజ్రీవాల్ డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా.. తమ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రజలకు ట్విట్టర్‌‌లో వీడియోల ద్వారా కేజ్రీవాల్ చేరవేస్తున్నారు. ఢిల్లీ ప్రజల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడ్డారు. తాము 24 గంటలుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంట్లో బైఠాయించినా.. తమతో మాట్లాడేందుకు ఆయన చొరవ చూపడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం తాము పోరాటం చేస్తున్నామని వెల్లడించారు.మరో వైపు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆప్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ మంగళవారం ఉదయం నుంచీ నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, బుధవారం మరో నేత, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా కూడా నిరాహార దీక్ష ప్రారంభించారు.