మిలటరీ పోలీస్ విభాగంలోకి మహిళలు!

08 September, 2017 - 7:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మిలటరీ పోలీస్‌ విభాగంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీంతో సైనిక బలగాల్లో లింగ వైరుధ్యాలకు చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. శుక్రవారం జరిగిన ఆర్మీ చీఫ్‌ల కాంక్లేవ్‌లో ఈ విషయం వెల్లడించారు. తొలిదశలో భాగంగా 800 మంది మహిళలను మిలటరీ పోలీసు విభాగంలో చేర్చుకుంటారు. దేశ రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం.

వైద్య సేవలు లాంటి ఎంపిక చేసిన విభాగాల్లో మిలటరీ పోలీసులో 1992 నుంచి మహిళలను అనుమతించారు. మరోవైపు సుమారు 1.45 లక్షల మంది సైనిక సిబ్బంది ర్యాంకుల ఉన్నతీకరణ చేపట్టాలని కూడా ప్రతిపాదించారు. రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే కీలక నిర్ణయాలు వెలువడటం గమనించదగ్గ విషయం. తొలి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ పరిజ్ఞానంతో మంత్రిత్వ శాఖను కొత్త పుంతలు తొక్కించడం, దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న అంశాల పరిష్కారం తన ప్రాధాన్యతా అంశాలుగా ముందుకెళ్లనున్నారు.

భోపాల్‌లోను, పంజాబ్‌లోని మామున్‌లో మరో రెండు ఆర్మీ పాఠశాలల్ని ప్రారంభించాలని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క పాఠశాలలో రెండు వేల మంది విద్యార్థులను చేర్చుకుంటారు. వీటి ఏర్పాటు కోసం రక్షన మంత్రిత్వ శాఖ రూ. 100 కోట్లు మంజూరు చేసింది.