పీఎస్‌ఎల్‌వీ-సీ-40 కౌంట్‌డౌన్‌ షూరు !

11 January, 2018 - 11:54 AM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్‌ నుంచి శుక్రవారం ఉదయం 9.28 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి40 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. కౌంట్‌డౌన్‌ కార్యక్రమం గురువారం ఉదయం 5.28 గంటలకు ప్రారంభమైంది. మూడు స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్ సిద్ధమైంది.

ఈ ప్రయోగంపై షార్‌లో బుధవారం రాకెట్‌ సన్నద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్‌) జరిగింది. ఇందులో రాకెట్‌కు సంబంధించిన పలు విషయాలను చర్చించారు. ఇందులో అధికారికంగా ప్రయోగ తేదీని ఖరారు చేశారు. రాత్రి జరిగిన లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశం(ల్యాబ్‌)లో ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

పీఎస్‌ఎల్‌వీ మనదేశానికి చెందిన 710 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్‌-2ఈతోపాటు 100 కిలోల మైక్రోశాట్‌, 11 కిలోల నానో ఉపగ్రహాలను ఈ రాకెట్‌ రోదసిలో విడిచి పెట్టనుంది. అలాగే విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలనూ నింగిలోకి పంపనున్నారు. కెనడా, ఫిన్‌లండ్‌, ఫ్రాన్స్‌, కొరియా, యూకే, యూఎస్‌ఏకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ 28 విదేశీ ఉపగ్రహాలు 420 కిలోలు బరువుకలిగి ఉన్నాయి. 2016 ఆగస్టు తర్వాత తాజాగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం చేసేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ గురువారం షార్‌కు రానున్నారు.

కాగా, గతేడాది ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ–సీ39 ద్వారా నావిగేషన్‌ శాటిలైట్‌ ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1హెచ్‌’ని పరీక్షించగా విఫలమైన విషయం తెలిసిందే.