కర్ణాటక మళ్లీ కాంగ్రెస్ చేతికే..!?

26 March, 2018 - 4:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కర్ణాటక మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ గుప్పిట్లోనే ఉంటుందా? ఈసారి ఎలాగైనా ఆ రాష్ట్రంలో గద్దెనెక్కాలని భావిస్తున్న బీజేపీ నాయకుల ఆశలకు గండిపడనుందా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వే అవుననే చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రమే కాకుండా తన సీట్లను కూడా పెంచుకోనుందట. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ దాదాపు 126 సీట్లు దక్కించుకోనుందని ఆ సర్వే తెలిపింది. ఓటర్ల శాతం కూడా కాంగ్రెస్‌‌కు అమాంతంగా పెరిగిపోనుందట.

వివరాల్లోకి వెళితే.. గతంలో 2013 సమయంలో కూడా సర్వే నిర్వహించి ఎన్నికల ఫలితాలు ముందే ఊహించి చెప్పిన సీ-ఫోర్స్‌ అనే సంస్థ తాజాగా మార్చి 1 నుంచి 25 వరకు సర్వే నిర్వహించింది. దాదాపు 154 నియోజకవర్గాల్లో 22,357మంది ఓటర్ల వద్ద ఆరా తీసింది. 2,368 పోలింగ్‌ బూత్‌ పరిధి ప్రాంతాలను కూడా ఈ సర్వే సందర్భంగా కవర్‌ చేశారు. మొత్తం 326 పట్ణణ ప్రాంతాల్లో, 977 గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వే చేశారు. అనంతరం ఆ నివేదిక వెల్లడిస్తూ.. తాము చెప్పిన ఫలితాల్లో ఒక శాతం అటూ ఇటూ తప్ప దాదాపు సరిగ్గా ఉండబోతుందని సీ-ఫోర్స్‌ జోస్యం చెప్పింది.

కాగా.. ఈ సర్వేను కాంగ్రెస్‌ పార్టీయే చేయించినట్లు తెలుస్తోంది. 2013లో కూడా సీ ఫోర్స్ అనే సంస్థ సర్వే చేసి ఆ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి 119 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పగా చెప్పిన ప్రకారమే 122 స్థానాలు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సారి కాంగ్రెస్‌ 126 స్థానాలు దక్కించుకుంటుందని, గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు పెరుగుతాయని సీ-ఫోర్స్‌ తెలిపింది. అంతే కాకుండా కాంగ్రెస్‌‌కు మొత్తం 9శాతం ఓట్లు పెరుగుతాయని, 46 శాతం ఓట్లు కొల్లగొడుతుందని, అదే సమయంలో బీజేపీకి 31 శాతం ఓట్లు, జేడీఎస్‌‌కు 16 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు మాత్రం ఒక సీటు వచ్చే అవకాశం ఉందని, వారికి 7శాతం ఓట్లు వెళతాయని తెలిపింది. ఈ సారి బీజేపీకి 70 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. గతంతో పోలిస్తే 30 సీట్లు అదనం అని పేర్కొంది. జేడీఎస్‌ మాత్రం కర్ణాటకలో గతంలో కంటే దారుణంగా దెబ్బతింటుందని వివరించింది.