అజారుద్దీన్ మనోడా.. కాదా.. కేసీఆర్?

12 January, 2018 - 7:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: భారతజట్టు మాజీ కెప్టెన్, హైదరాబాదీ అజారుద్దీన్ మనవాడా.. కాదా.. తేల్చి చెప్పాలంటూ తెలంగాణా సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు (వీహెచ్) సూటిగా ప్రశ్నించారు. ‍హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌‌సీఏ)పై వీహెచ్ శుక్రవారం మరోసారి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అజారుద్దీన్‌‌ను హెచ్‌‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌కి జరిగిన అవమానంపై పాకిస్తాన్ కోడై కూస్తోందన్నారు. ‘అవసరం ఉంటే అజార్ భాయ్ అంటారు.. అవసరం తీరాక హట్ ఛలో అంటారా..?’ అని వీహెచ్ ధ్వజమెత్తారు.

అజారుద్దీన్ హెచ్‌‌సీఏ సభ్యుడు కాదని మొన్నటి వరకు హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారని వీహెచ్ అన్నారు. అజారుద్దీన్‌కి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్‌‌సీఏ అనుమతి ఇవ్వడం లేదేమని వీహెచ్ ప్రశ్నించారు. అజారుద్దీన్‌పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు.

రాజకీయ కుట్రలతో తాను హెచ్‌‌సీఏ సమావేశానికి వస్తున్నానని వివేక్ కరీంనగర్‌లో మాట్లాడారని హనుమంతరావు అన్నారు. ఎనిమిది నెలల క్రితం నెలకొల్పిన ప్యానల్‌కి శేష నారాయణ సెక్రటరీ, వివేక్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. ఎన్నో ఏళ్ళు హెచ్‌సీఏని పాలించిన వినోద్‌‌కి పెద్ద పదవి కట్టపెట్టాలని వివేక్ అంటే దానికి శేషనారాయణ ఒప్పుకోనందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారని వీహెచ్ ఆరోపించారు.

ఉప్పల్ స్టేడియానికి వివేక్ తండ్రి వెంకటస్వామి పేరు పెట్టేందుకు ఎన్నో యత్నాలు చేశారని వీహెచ్ అన్నారు. స్టేడియం టికెట్ల మీద విశాఖ సంస్థ పెరు ముద్రించుకుని అమ్ముతున్నారన్నారు. ఆ తరువాత ఐపీఎల్ వారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. వివేక్, వినోద్‌ కలిసి హెచ్‌‌సీఏని దోచుకుంటున్నారని వీహెచ్ మండిపడ్డారు. వెంకటస్వామి పేరుతో జరుగుతున్న టోర్నమెంట్లపై రూ.12 లక్షలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

తన ఎంపీ నిధులు రాజీవ్‌గాంధీ స్విమ్మింగ్ పూల్, ఫుట్‌బాల్ గ్రౌండ్, రాజీవ్‌గాంధీ పేరు మీద పిల్లలకు స్టైపండ్‌ ఇస్తున్నానని, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు. తెలంగాణ క్రికెట్ అని క్లబ్ ఉంటే నష్టం ఏంటని కేసీఆర్‌‌ని వీహెచ్ ప్రశ్నించారు. అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడని, ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని అన్నారు. హెచ్‌‌సీఏ నిర్వహించే టోర్నమెంట్లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు.

కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని వీహెచ్ అన్నారు. సానియా మీర్జా, పీవీ సింధు గెలిస్తే డబ్బులు, భూములు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. హెచ్‌‌సీఏ మీ అయ్య జాగిరా..? అంటూ తీవ్రస్థాయిలో వీహెచ్ విమర్శించారు. ‘పక్క రాష్టంలో క్రీడలు ఎలా ఉన్నాయి.. తెలంగాణలో ఎలా ఉన్నాయి. వివేక్ రాజకీయంగా ఏమైనా చేసుకో కానీ, క్రీడలను నిర్లక్ష్యం చెయ్యకు’ అంటూ వీహెచ్‌ మండిపడ్డారు. ఇటు ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా ఎలా కొనసాగుతారంటూ వివేక్‌ను వీహెచ్ ప్రశ్నించారు.