కాంగ్రెస్ ఖాతాలోకి కర్ణాటక అసెంబ్లీ స్థానం!

13 June, 2018 - 1:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: జయనగర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బీజేపీకి గట్టి షాకే తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి బీఎన్‌ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సౌమ్యా రెడ్డి 2,889 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌‌ అభ్యర్థికి 54,457 ఓట్లు పడగా.. బీజేపీ కేండిడేట్‌కి 51,568 ఓట్లు వచ్చాయి. ఈ తాజా గెలుపుతో కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యుల బలం 80కి చేరింది.

జయనగర బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌‌కుమార్‌ ఆకస్మికంగా మృతిచెందడంతో ఈ సెగ్మెంట్‌లో మే 12న జరగాల్సిన ఎన్నిక వాయిదాపడింది. దీంతో ఎన్నికల కమిషన్‌ ఈ స్థానానికి జూన్‌ 11న (సోమవారం) పోలింగ్ నిర్వహించారు. ఈసారి జయనగర అసెంబ్లీ స్థానంలో 55 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఈ ఎన్నికలో బీజేపీ తరపున విజయ్‌ కుమార్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి పోటీ పడ్డారు. కాంగ్రెస్‌– జేడీఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యకు జేడీఎస్‌ మద్దతు ప్రకటించడం కాంగ్రెస్‌ విజయానికి కలిసి వచ్చింది.జయనగర్‌ ఫలితాల్లో తమ అభ్యర్థి విజయం సాధించడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ​కౌంటింగ్‌ సెంటర్‌ బయట డ్యాన్స్‌‌లు చేస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు.