‘శభాష్ హైదరాబాద్ పోలీస్’

30 November, 2017 - 8:54 PM


(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భాగ్యనగరంలో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్(జీఈఎస్) తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీఈఎస్, మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాలను దిగ్విజయం చేశారని చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత హుందాగా పోలీస్‌శాఖ పనిచేసిందని ప్రశంసించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటన ఆద్యంతం రహస్యంగానే జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాంకా కదలికలపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు చివరిక్షణంలోనే రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చేవారని చెప్పారు. తొలుత ఇవాంకా ప్రత్యేక విమానంలో వస్తారని చెప్పారని, అయితే ఆమె అందుకు భిన్నంగా సాధారణ విమానంలో వచ్చారని తెలిపారు. అలాగే ముందుగా ఆమె వెస్టిన్ హోటల్లో బస చేస్తారని చెప్పారు, కానీ ఆమె బసను ట్రైడెంట్‌ హోటల్‌కు మార్చారని ఆయన గుర్తుచేశారు.

ఇవాంక గోల్కొండ కోట సందర్శన చివరి క్షణం వరకూ గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు కూడా పనిచేశారని ఆయన అభినందించారు. జీఈఎస్ విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అనేక మంది ప్రముఖులకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారని కేంద్రం ప్రశంసించినట్లు చెప్పారు. పోలీసులు సమన్వయం, టీం స్పిరింట్‌తో పని చేసి తెలంగాణ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేశారు.

ఒకే రోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించారని సీఎం కితాబిచ్చారు. పోలీసులు ముందస్తు ప్రణాళిక, వ్యూహం ప్రకారం పనిచేయడంతో ఎక్కడ చిన్న అవాంతరం కూడా జరుగలేదన్నారు. తనిఖీల పేరుతో అతిథులను ఇబ్బంది పెట్టకుండానే కావాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.

రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అందరినీ సమన్వయం చేస్తూ అతిపెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సీఎం తెలిపారు. తెలంగాణ పోలీసులు అత్యున్నత ప్రమాణాలతోపాటు హుందాగా వ్యవహరించారన్నారు. రాష్ట్ర పోలీసులను అమెరికా సీక్రెట్ ఏజెన్సీ, కేంద్ర హోంశాఖ, నీతి ఆయోగ్, వివిధ దేశాల ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయని సీఎం కేసీఆర్ చెప్పారు.