ఒకే నియోజకవర్గంలో చంద్రబాబు- జగన్‌ల సంక్రాంతి!

13 January, 2018 - 9:02 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్ ఇద్దరూ సంక్రాంతి పండుగకు ఒకే నియోజకవర్గంలో బస చేయనున్నారు. చంద్రబాబు ప్రతి ఏడాది తన స్వగ్రామమైన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తోన్న విషయం తెలిసింది. శనివారం చిత్తూరు, తిరుపతిలో పర్యటించనున్న చంద్రబాబు సాయంత్రానికి స్వగ్రామం చేరుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను అక్కడే జరుపుకుంటారు. సంక్రాంతి సంబరాల అనంతరం చంద్రబాబు ఈనెల 16న తిరిగి అమరావతి రానున్నారు.

మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర షెడ్యూలు ప్రకారం.. 14న ఉదయం చంద్రగిరి సరిహద్దులు దాటాల్సి ఉంది. అయితే యాత్ర చేపట్టిన మార్గంలో స్వల్ప మార్పుల కారణంగా సంక్రాంతి, కనుమ రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలోని గ్రామాల్లో బస చేయనున్నారు. ఫలితంగా సీఎం, విపక్ష నేతలు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో ఉండనున్నారు. ఇది యాదృచ్ఛికమే అయినా జిల్లాలో ఆసక్తికరంగా మారింది.