సాయికిరణ్ ఒక్కడే హత్య చేయలేదు

13 September, 2017 - 11:33 AM


(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తమ కూతురుని పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని దారుణ హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని చాందిని తల్లి ఆరోపించారు. ఇది సాయికిరణ్ ఒక్కడే చేసిన పని కాదని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. సాయి కిరణ్ వెనుక సూపర్ సీనియర్స్ ఉన్నారని ఆమె ఆరోపించారు. మిగిలిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. నమ్మిన స్నేహితులే చాందిని హత మార్చారని కన్నీటి పర్యంతమయ్యారు. సాయికిరణ్ జీవితానికి చాందిని అడ్డుగా ఉందని ఆమెను చంపేశారని ఆరోపించారు.

ఇష్టం లేకపోతే వదిలేయాలి కానీ చంపేస్తారా అని ప్రశ్నించారు. స్నేహితులే ఇలా చేస్తే ఇక ఎవరిని నమ్మలేమని, ఆడపిల్లలు బయటికి వెళితే భద్రత లేకుండా పోతోందని చాందిని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయోనని పేర్కొన్నారు. టీనేజ్‌లో ఉన్న వీరిమధ్య అట్రాక్షన్ ఉండటం సహజమే. కానీ సాయికిరణ్‌ను ప్రేమిస్తున్నట్లు తన కూతురు చాందిని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సాయికిరణ్ మంచివాడని అనుకున్నాం, కానీ అతడు ఇంత దారుణానికి పాల్పడుతాడని మేం ఎవరం ఊహించలేదని చాందిని తల్లి చెప్పారు.మియాపూర్ మదీనాగూడకు చెందిన చాందిని జైన్ అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో హత్యకు గురయిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన చాందిని హత్యకేసు మిస్టరీ వీడింది. స్నేహితుడు సాయికిరణే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకోవాలంటూ చాందిని అతడిపై ఒత్తిడి తీసుకురావడమే హత్యకు కారణమని తేల్చారు.