నిర్మాణ రంగంపై సిమెంట్ ధర బండ

13 September, 2017 - 8:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఏలూరు: సిమెంట్ ధర మరోసారి ఆకాశాన్నంటింది. ఈ నెల 1 నుంచి ఒక్కసారిగా బస్తాకు రూ.30 వరకు ధర పెరగటంతో నిర్మాణ రంగంపై బండ పడినట్లయింది. దీనికి జీఎస్టీ 28 శాతం కలుపుకుని ఒక్కో సిమెంట్ బస్తాపై రూ.39 మేర పెరిగింది. దీనికి రవాణా, ఇతర ఖర్చులు కలుపుకుంటే.. ధర మరో రూ.20 పెరగనుంది. పెరిగిన ధర ప్రభావం ఎన్టీఆర్‌ పక్కాగృహాల నిర్మాణంపైనా పడుతుందంటున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

అసలే మందకొడిగా సాగుతున్న నిర్మాణ రంగం.. సిమెంట్ కంపెనీల సిండికేట్‌ మాయాజాలంతో అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ధర పెరగనున్నట్లు విక్రయదార్లకు ఆగస్టు నెలాఖరులోనే సమాచారం ఇచ్చిన కంపెనీలు సెప్టెంబర్‌ 1 నుండి రేట్లు పెంచేశాయి. కొన్ని ప్రధాన కంపెనీలు రెండు రోజులు సరఫరా నిలిపివేసి, అనంతరం పెరిగిన ధరలతో మార్కెట్లోకి సిమెంట్ సరఫరా ప్రారంభించాయి.

నిర్మాణ రంగంలో సూపర్‌ 59 గ్రేడ్‌ సిమెంట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిపై ధర పెరిగిన ప్రభావం ఎక్కువగా పడుతోంది. ధరలు పెరగక ముందు సూపర్‌ సిమెంట్ బస్తా రూ.288 ఉండగా ఇప్పుడు అది రూ.328 అయింది. 53 గ్రేడ్‌ ధర రూ.316 ఉండగా రూ.356కు పెరిగింది. దీనికి ఎగుమతి, దిగుమతి, రవాణా వ్యయం రూ.15 నుండి రూ.20 వరకు కలుస్తుంది.

సిమెంట్ కంపెనీ బ్రాండ్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. పక్కా గృహాల నిర్మాణంలో ఉన్న పేదలపై ఈ ధరలు మోయలేని భారంగా మారాయని, సిమెంట్ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.