సీఎం సతీమణికి చేదు అనుభవం

19 March, 2018 - 3:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత ఫడ్నవీస్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. షోలాపూర్‌‌లో జరిగిన పతంజలి ఉత్పత్తుల ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆమె‌కు వ్యతిరేకంగా నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. పతంజలి ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌‌ను కల్పిస్తున్నారో స్వయం ఉపాధి మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకూ అలాంటి మార్కెట్‌ సదుపాయాలనే కల్పించాలంటూ వారు డిమాండ్‌ చేశారు.

కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఎన్సీపీ మహిళా కార్యకర్తలు వేదిక వెలుపలకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కార్యక్రమం పూర్తయిన తర్వాత విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి మీదా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ.. పతంజలి ఉత్పత్తులను ప్రజలు గుడ్డిగా నమ్ముతారని అన్నారు. పతంజలి ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని బాబా రాందేవ్‌ దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, రాజ్యసభ ఎంపీ హేమమాలిని కూడా హాజరయ్యారు.