‘భరత్ అనే నేను’ మూవీ రివ్యూ

20 April, 2018 - 3:41 PM

సినిమా: భరత్‌ అనే నేను
జానర్: కమర్షియల్‌ డ్రామా
తారాగణం: మహేష్‌‌బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్‌‌రాజ్‌, శరత్‌‌కుమార్‌, బ్రహ్మాజీ, రావు రమేష్‌ తదితరులు
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌
స్టోరీ, డైలాగులు, స్క్రీన్‌‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: డీవీవీ దానయ్య

సూప‌ర్‌‌స్టార్ మ‌హేశ్‌బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాకుండా బిజినెస్ వ‌ర్గాల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఆపైన కొర‌టాల శివ వంటి ద‌ర్శకుడితో మ‌హేశ్ సినిమా అంటే అంచ‌నాలు మరెంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ‌హేశ్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌‌లో ఇంత‌కు ముందు `శ్రీమంతుడు` సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాలో మ‌హేశ్ ముఖ్యమంత్రిగా న‌టిస్తుండ‌టంతో సినిమా ఎలా ఉంటుందో.. సినిమా పొలిటిక‌ల్ సెటైర్‌‌గా ఉంటుందా? మెసేజ్ చిత్రాల‌ను అందించే శివ ఈ చిత్రంలో ఎలాంటి మెసేజ్ ఇస్తాడో అని క్యూరియాసిటీ వ‌చ్చింది. మ‌రి సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ను అందుకుందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నిజానికి మహేశ్‌బాబుకు కొంతకాలంగా సరైన సక్సెస్‌ రాలేదు. ఈ క్రమంలో శ్రీమంతుడితో తనకు ఇండస్ట్రీ హిట్‌ అందించిన దర్శకుడు కొరటాల శివతో మరోసారి ప్రేక్షకుల ముందకు వచ్చాడు. కంప్లీట్‌ పొలిటికల్‌ అండ్‌ కమర్షియల్‌ డ్రామాగా కొరటాల దీనిని తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య భరత్ అనే నేను చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్టోరీ:
భరత్‌‌రామ్‌ (మహేశ్‌బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్‌ ఆక్స్‌‌ఫర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ (శరత్‌‌కుమార్‌) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోవయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రాఘవ మృతితో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద (ప్రకాశ్‌‌రాజ్‌) భరత్‌‌ను సీఎంను చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్‌ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్‌ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుమారుడి కేసులో భరత్‌‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌‌కు మద్దతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని అధిగమించి భరత్‌ తన ప్రామిస్‌‌లను ఎలా పూర్తిచేస్తాడు? అనేది కథ.నటీనటులు:
భరత్‌‌రామ్‌గా మహేశ్ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన కథను పూర్తిగా తన భుజాల మీదే నడిపించాడు. ముఖ్యమంత్రి పాత్రకు కావాల్సిన హుందాతనం చూపిస్తూనే, స్టైలిష్‌‌గా రొమాంటిక్‌‌గానూ ఆకట్టుకున్నాడు. భరత్‌‌గా ఓ ఛాలెంజింగ్‌ రోల్‌‌లో మహేశ్ పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ చీఫ్‌ మినిస్టర్‌ పాత్రలో పర్ఫెక్ట్‌‌గా ఒదిగిపోయాడు. తన కెరీర్‌ బెస్ట్‌ పెర్‌‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా సూపర్‌‌స్టార్‌ అభిమానులను అలరిస్తాయి. రొమాంటిక్ సన్నివేశాల్లో అభిమానులను అలరిస్తాడు. సామాజిక అంశాలకు సంబంధించిన సీన్లలో భావోద్వేగానికి గురిచేస్తాడు. మహేశ్ గ్లామర్ విషయానికి వస్తే వంశీ, పోకిరి చిత్రాల్లో మాదిరిగా కుర్రాడిలా కనిపించాడు. ప్రధానంగా మీసాలు పెట్టుకొన్న సన్నివేశాల్లో సూపర్‌స్టార్ కృష్ణలా కనిపించాడు. కొన్ని డైలాగ్స్ చెప్పినప్పుడు కృష్ణను గుర్తు చేస్తాడు.

గాడ్‌‌ఫాదర్‌ పాత్రలో ప్రకాశ్‌‌రాజ్‌ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేనన్న రీతిలో ఆయన నటించాడు. హీరోయిన్‌‌గా పరిచయం అయిన కైరా అద్వానీది చిన్న పాత్రే.. అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు సాధించింది. సీఎం భరత్‌ పర్సనల్‌ సెక్రటరీగా బ్రహ్మాజీ.. పోసాని కామెడీ ట్రాక్‌‌లు ఆకట్టుకున్నాయి. శరత్‌‌కుమార్‌, ఆమని, సితార, అజయ్‌, రావు రమేష్‌, దేవరాజ్‌ తమ పాత్రల మేర అలరించారు.విశ్లేషణ:
హ్యాట్రిక్‌ బ్లాక్‌‌బస్టర్లతో జోరు మీదున్న కొరటాల శివ మహేష్‌‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. సమకాలీన రాజకీయ అంశాలు.. వాటికి తగ్గట్లు కమర్షియల్‌ అంశాలను జోడించి మూవీని బాగా ఎంగేజ్‌ చేశాడు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా సీఎం అయిపోవటం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు… ఫస్టాఫ్‌‌ను ఎంటర్‌‌టైనింగ్‌‌గా మలిస్తే, దుర్గామహల్‌ ఫైట్‌.. సామాజిక సందేశం, హీరోయిజం ఎలివేట్‌ అయ్యే సన్నివేశాలు… ఇవన్నీ సెకండాఫ్‌‌ను నిలబెట్టాయి. పది నిమిషాల్లో అసలు కథలోకి ఎంటరైన దర్శకుడు తరువాత కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. అయితే కొరటాల మార్క్‌ డైలాగ్స్‌, మహేశ్ ప్రజెన్స్‌ ఆడియన్స్‌‌ను అలరిస్తాయి. సీఎం స్థాయి వ్యక్తి రోడ్డు మీద అమ్మాయిని చూసి ప్రేమించటం లాంటి విషయాల్లో కాస్త ఎక్కువగానే సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. కొరటాల గత చిత్రాల్లో కనిపించిన వీక్‌‌నెస్‌ ఈ సినిమాలో కూడా కొనసాగింది. క్లైమాక్స్‌ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. భరత్‌ సీఎంగా రాజీనామా- తిరిగి పగ్గాలు చేపట్టడం లాంటి సన్నివేశాల్లో దర్శకుడు నాటకీయత ఎక్కువగా జోడించాడు.

టెక్నికల్‌ టీమ్‌ ఈ మూవీకి మంచి తోడ్పాటు అందించింది. సినిమాటోగ్రాఫర్‌ రవి కే చంద్రన్‌ క్లాస్‌ పనితనాన్ని అందించారు. ముఖ్యంగా పాటలు, యాక్షన్స్‌ సీన్స్‌ పిక్చరైజేషన్స్‌ వావ్‌ అనిపిస్తుంది. దేవీ పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌‌తో మెప్పించాడు. ముఖ్యంగా ఒక్కో పాత్రకు ఒక్కో సిగ్నేచర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌‌తో పాత్రలను మరింతగా ఎలివేట్‌ చేశాడు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. భరత్‌ పాత్ర.. దానిలో మహేవ్ కనబరిచిన నటన.. కొరటాల అందించిన డైలాగులు ఇలా అన్ని హంగులు అన్ని వర్గాల ప్రేక్షలను అలరించేవిగా ఉన్నాయి. భరత్ అనే నేను చిత్రం మహేశ్ కెరీర్‌‌లోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉంది.

ఫ్లస్‌ పాయింట్లు :
మహేశ్‌బాబు నటన, పాత్ర చిత్రీకరణ
కథా, కథనం
పాటలు, బ్యాక్‌‌‌గ్రౌండ్‌ స్కోర్‌
సమకాలీన రాజకీయాంశాల సమతుల్యత
ఛాయాగ్రహ‌ణం
నిర్మాణ విలువ‌లు
మైనస్‌ పాయింట్లు:
స్లో నెరేషన్‌
సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్‌
క‌థ‌కు సంబంధం లేని పాట‌లు
కామెడీ క‌థ‌లో భాగంగా లేక‌పోవ‌డం
రియాలిటీకి దూరంగా సీఎం చ‌ర్యలు