బంగ్లా చేతిలో భారత్ ఓటమి

10 June, 2018 - 3:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కౌలాలంపూర్‌: ఆసియాకప్‌ మహిళల టీ 20 టైటిల్‌‌ను బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. ఆదివారం భారత్‌‌తో జరిగిన ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. వరుసగా గత ఆరు టోర్నీల టైటిళ్లను నెగ్గిన భారత్‌‌కు ఈ సారి బంగ్లాదేశ్‌ షాక్‌ ఇచ్చింది. లీగ్‌ మ్యాచ్‌‌లో కూడా భారత్‌‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ మహిళలు అదే ప్రదర్శనను తుది పోరులోనూ పునరావృతం చేసి టైటిల్‌ నెగ్గారు. ఫలితంగా తొలిసారి బంగ్లాదేశ్‌ ఆసియాకప్‌‌ను సొంతం చేసుకుంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌‌కు దిగిన భారత మహిళల్లో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (56) మినహా అందరూ విఫలమయ్యారు. స్మృతీ మంధాన (7), దీప్తి శర్మ(4), మిథాలీ రాజ్‌ (11), అనుజా పటేల్‌ (3 ఆబ్సెంట్‌ హర్ట్‌)లు తీవ్రంగా నిరాశపరచడంతో భారత్‌ కేవలం 113 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి బంగ్లాదేశ్‌కు నిర్దేశించించగలిగింది.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్‌ మహిళలు కూడా తడబడడం గమనార్హం. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌నే విజయం వరించింది. ఓపెనర్లు షమిమా సుల్తానా (16), అయేషా రెహ్మాన్‌ (17)లు మంచి శుభారంభాన్ని అందించినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కలేకపోయారు. నిగర్‌‌సుల్తానా (27) దాటిగా ఆడే ప్రయత్నం చేసినా పూనమ్‌ యాదవ్‌ వేసిన చక్కని బంతికి పెవిలియన్‌ చేరింది.

చివర్లో రుమాన్‌ అహ్మద్‌ (23) రాణించడంతో బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే కెప్టెన్‌ హర్మన్‌ కట్టడి చేయడంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జహనార్‌ అలామ్‌ ఇన్నింగ్స్‌ ఆఖరికి రెండు పరుగులు తీయడంతో బంగ్లా విజయం సాధించింది.

భారత మహిళల్లో పూనమ్‌ యాదవ్‌ 4 వికెట్లు తీయగా.. హర్మన్‌ ప్రీత్‌ రెండు వికెట్లు తీసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు హర్మన్‌ ప్రీత్‌‌కు దక్కగా.. విమెన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రుమాన్‌ అహ్మద్‌‌ గెలుచుకుంది.