అక్కడ త్రేన్పులు నిషిద్ధం..!

10 January, 2018 - 5:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులో ఉద్యోగుల ప్రవ‌ర్తన, అల‌వాట్లు ఎలా ఉండాలనే దాని గురించి కొత్తగా ఆదేశాలు జారీచేసింది. ఇందులో ఆఫీసులో పెద్దగా త్రేన్చడాన్ని నిషేధించింది. మరీ ముఖ్యంగా స‌మావేశాలు జ‌రుగుతున్నపుడు, అత్యవ‌స‌ర ప‌నుల్లో ఉన్నపుడు త్రేన్చకూడ‌ద‌ని ఆదేశించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు, స‌హోద్యోగుల‌కు చిరాకు క‌లిగి, ప‌ని మీద దృష్టిసారించ‌లేక‌పోతున్నార‌ని స‌ర్క్యుల‌ర్‌‌లో వ్యాఖ్యానించింది.

ఫ్రంట్ ఆఫీస్‌‌లో ప‌నిచేసే వారు, ఒకే గ‌దిలో ఇతర ఉద్యోగుల మ‌ధ్య విధులు నిర్వర్తించేవారు, క‌స్టమ‌ర్ కేర్ డెస్క్‌‌లో ఉండేవారు గ‌ట్టిగా త్రేన్చడం అమ‌ర్యాద‌కర చర్య. అజీర్తి వంటి కార‌ణాల వ‌ల్ల త్రేన్పులు వ‌స్తుంటాయి. ఎక్కువ శ‌బ్దంతో మాటిమాటికీ త్రేన్చడం వ‌ల్ల ఇత‌ర ఉద్యోగుల‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని ఎస్‌‌బీఐ గ్రహించి ఈ ఆదేశాలు తెచ్చిన‌ట్లు సమాచారం.

దీంతో పాటుగా బ్యాంకు సిబ్బంది విధులకు టీ ష‌ర్టులు, జీన్స్‌, స్పోర్ట్స్ షూస్ వేసుకురావ‌డంపైన కూడా ఎస్‌‌బీఐ నిషేధం విధించింది. 13,000 దేశీయ శాఖ‌ల్లో, 190 అంత‌ర్జాతీయ శాఖ‌ల్లోని దాదాపు 2,68,705 ఉద్యోగుల‌కు ఈ ఆదేశాల‌ను ఎస్‌‌బీఐ జారీచేసింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసే సీనియ‌ర్ పురుష ఉద్యోగులు, క‌స్టమ‌ర్లను క‌లిసిన‌పుడు సెమీ-ఫార్మల్ ధ‌రించి, టై క‌ట్టుకోవాల‌ని సూచించింది. సీనియ‌ర్ మ‌హిళా ఉద్యోగులు ఫార్మల్ భార‌తీయ వ‌స్త్రధార‌ణ‌లో గానీ, ఫార్మల్ పాశ్చాత్య దుస్తుల్లో గానీ ఉండాల‌ని పేర్కొంది.