అమెరికా లేక్‌లో తెలంగాణ ఎన్నారై మృతి

14 May, 2018 - 3:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

డల్లాస్: అమెరికాలోని ఉత్తర టెక్సాస్‌‌లో జరిగిన ప్రమాదంలో తెలంగాణాలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన టెకీ వెలమ వెంకట్రామిరెడ్డి మరణించారు. కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గ్రేప్‌‌వైన్ లేక్‌లో బోటింగ్ చేయడానికి వెళ్ళిన వెంకట్రామిరెడ్డి మరణించారు. పొంటూన్ బోటు నుండి ఈత కొట్టేందుకు నీళ్ళలోకి దూకిన ఆయన ఎంతకీ పైకి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే.. 24 గంటల తర్వాత వెంకట్రామిరెడ్డి మృతదేహం సరస్సులో దొరికింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో సుమారు 12 మంది ఉన్నారు.

వెంకట్రామిరెడ్డి డల్లాస్‌లోని గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వాణి కూడ ఉద్యోగిని. ఈ విషయాన్ని వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా.. ఆదివారం అదే సరస్సులో జరిగిన మరో ప్రమాదంలో సరస్సులో మునిగిపోయిన ఓ 25 ఏళ్ల యువకుడిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అతడిని బెయిలర్‌ స్కాట్‌ అండ్‌ వైట్‌ మెడికల్‌ సెంటర్‌‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ రెండు ఘటనల్లో బాధితులు లైఫ్‌ జాకెట్‌ ధరించకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని గ్రేప్‌‌వైన్‌ ఫైర్‌ డిపార్ట్‌‌మెంట్‌ అసిస్టెంట్‌ చీఫ్‌ జాన్‌ షేర్‌‌వుడ్‌ తెలిపారు.