స్మశానంలో కోచ్ నిరశన దీక్ష!

08 May, 2018 - 4:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తనను, తన కుటుంబాన్ని అవమానించారంటూ కోచ్‌ చెరుకూరి సత్యనారాయణ మంగళవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గుణదల స్మశానవాటికలోని తన కుమారుడు లెనిన్ సమాధి వద్ద ఆయన నిరశన దీక్ష మొదలెట్టారు. జోత్యి సురేఖ, ఆమె తండ్రి తన కుటుంబాన్ని అవమానించారని ఆయన ఆరోపించారు. తమకు క్షమాపణ చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. తానే కాకుండా తన భార్య కూడా తమ ఇంట్లో దీక్ష చేస్తోందని చెప్పారు.

జ్యోతి సురేఖను తాను ఎప్పుడూ 15 లక్షల రూపాయలు అడగలేదని సత్యనారాయణ అన్నారు. తమ పేరు చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్లకు రావాల్సిన డబ్బు తీసుకున్నారని, ఆమె శిక్షణ తీసుకుంది తమ వోల్గా ఆర్చరీ సెంటర్‌‌లోనే అని ఆయన తెలిపారు.

కాగా.. ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో తనకు కోచ్‌‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని జ్యోతి సురేఖ ఖండించింది. తనకు ఏనాడూ సత్యనారాయణ కోచ్‌‌గా వ్యవహరించలేదని ఆమె స్పష్టం చేసింది. తన కోచ్‌‌లు జె.రామారావు, జీవన్‌‌జ్యోత్‌‌సింగ్‌ అని చెప్పింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ తనను అడ్డుకున్నారని, దీంతో పెట్రోలియం స్పోర్ట్స్‌ బోర్డ్‌ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపింది. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు చెపేర్కొంది. మరోవైపు జ్యోతి సురేఖకు బేసిక్‌ కోచ్‌‌ను తానేనని చెరుకూరి సత్యనారాయణ వాదిస్తున్నారు.