భూమి నెత్తిన మరో ‘స్కైలాబ్‌’..!?

06 September, 2017 - 7:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సుమారు నాలుగు దశాబ్దాల కిందట అమెరికా తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం ‘స్కైలాబ్‌’ రోదసి నుంచి కూలిపోయి సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ప్రపంచానికి ఎదురవబోతోంది. గత నెల 31న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1 హెచ్‌ ఉపగ్రహం మరో స్కైలాబ్‌ అవబోతోంది. ఇస్రో ప్రయోగం విఫలమవడంతో రమారమి ఒకటిన్నర టన్నుల బరువుండే ఈ ఉపగ్రహం రోదసిలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ ఉపగ్రహం మరో 40 నుంచి 60 రోజుల్లో భూవాతావరణంలో ప్రవేశిస్తుందని, ఆ సమయంలో పేలిపోతే దాని శకలాలు తీవ్ర నష్టాన్ని కలగజేసే ప్రమాదం ఉందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ అలాంటి ప్రమాదమేదీ లేదని ఇస్రో తోసిపుచ్చుతోంది.

దేశీయ నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించుకోవడంలో భాగంగా ఆగస్టు 31న ఇస్రో ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1 హెచ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. కానీ.. ఆ రాకెట్‌ హీట్‌‌షీల్డ్‌‌లో లోపం ఉండి తెరుచుకోలేదు. దాంతో రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించలేదు. రాకెట్‌ హీట్‌‌షీల్డ్‌లోనే ఉండిపోయింది. దీని ఫలితంగా ప్రయోగం విఫలమైంది.

హీట్‌‌షీల్డ్‌తో కలిపి ఈ ఉపగ్రహం ఇప్పుడు భూవాతావరణం వైపు వేగంగా తిరిగి వస్తోంది. మరో నలభై నుంచి 60 రోజుల్లో భూవాతావరణంలోకి అది ప్రవేశిస్తుందట. ఆ సమయంలో ఆ ఉపగ్రహం పేలిపోతే ఆ శకలాలు ఎక్కడ పడతాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉపగ్రహాలు మనకు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని పెరిజి (భూమికి సమీపంలో ఉన్నప్పుడు), అపోజి (భూమికి దూరంగా ఉన్నప్పడు)లలో కొలుస్తారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం పెరిజి 164 కిలోమీటర్లు ఉంటే.. అపోజి 6,500 కిలోమీటర్లు ఉందట.

రాకెట్‌ నాలుగో దశ భాగం, ఉపగ్రహం, హీట్‌ షీల్డ్‌ ఈ మూడింటి బరువు 2.4 టన్నులని, ప్రస్తుతం ఈ ఉపగ్రహం నుంచి తమ ట్రాకింగ్‌ స్టేషన్లకు సంకేతాలు అందుతున్నాయని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కె. శివన్ చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలో 750 కేజీల ఇంధనం ఉందని, దానికి సంకేతాలు పంపి మండించటానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. భూవాతావరణంలోకి అది ఎప్పుడు ప్రవేశిస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం అని పేర్కొన్నారు.ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ట్రాకింగ్‌ స్టేషన్ల ఆధీనంలో ఉండదని ఇస్రోలో సీనియర్‌ శాస్త్రవేత్తగా రిటైరైన డాక్టర్‌ పి.పూర్ణచంద్రరావు అంటున్నారు. ‘ఒక రాకెట్‌‌ను సెకనుకు కిలోమీటరు వేగంతో పైకి పంపుతారని, కానీ అది రోదసి నుంచి భూవాతావరణంలోకి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందన్నారు. భూవాతావరణం సమీపంలోకి వచ్చే సరికి భూమ్యాకర్షణ శక్తి ఉపగ్రహంపై పనిచేసి తనవైపు లాక్కుంటుందన్నారు. ఆ క్రమంలో ఉపగ్రహం శకలాలు ఎక్కడ పతాయనేదే పెద్ద ప్రశ్న అంటున్నారు.

అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించే శకలాల వేగాన్ని కనిపెట్టేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా దగ్గర టూ ఎలిమెంట్‌ సిస్టమ్‌ అనే వ్యవస్థ, ఇస్రో వద్ద మల్టీ అబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉన్నాయి. టూ ఎలిమెంట్‌ సిస్టమ్‌ అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాల పైన, శకలాల పైన ఓ కన్నేసి ఉంచుతుంది. వీటి ద్వారా శకలాలు భూవాతావరణానికి సమీపంలోకి వచ్చినప్పుడు తెలుస్తుందట.

ఆ శకలాలు ఎక్కడ పడతాయనే విషయం 36 గంటల ముందు మాత్రమే కనిపెట్టే వీలుందని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కె. శివన్ చెబుతున్నారు. ట్రాకింగ్‌ స్టేషన్ల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా చూస్తే ఆ శకలాలు సముద్రంలో పడతాయని భావిస్తున్నామన్నారు. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం 36 గంటల ముందు మాత్రమే తెలుస్తుందంటున్నారాయన. ఈ ఉపగ్రహం మరో స్కైలాబ్‌ అయ్యే అవకాశం లేదంటున్నారు.

ఇప్పటి తరం వారికి స్కైలాబ్ పేరు గురించి తెలియదు గానీ, 40- 50 ఏళ్లు దాటిన వారికి ఆ సంచలనం గురించి బాగా తెలుసు! అమెరికా ప్రయోగించిన ఆ తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం 1979 జూలై 11న కూలిపోయింది. అది కూలడానికి కొద్దిరోజుల ముందు ‘స్కైలాబ్‌ మీద పడుతుందట.. మనుషులంతా చచ్చిపోతారట..’ అనే వదంతులు జోరుగా షికారు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా అరాచకం ప్రబలింది.