గుజరాత్ అల్లర్ల కేసు.. షాకు సమన్లు

12 September, 2017 - 4:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అహ్మదాబాద్: గుజ‌రాత్‌లో 2002లో జ‌రిగిన అల్లర్ల కేసుకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు స్పెషల్ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసులో హ‌త్యానేరం ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నానీకి సాక్షిగా ఈ నెల 18న వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా కోర్టు ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. అల్లర్ల స‌మ‌యంలో 2002 ఫిబ్రవరి 28న న‌రోదా గామ్‌లో 11 మంది ముస్లింల హ‌త్య జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అయితే ఆ స‌మ‌యంలో తాను అక్కడ లేన‌ని మాయా కొద్నానీ కోర్టుకు తెలిపింది. ఈ విషయంపై అమిత్ షాతో మాట్లాడ‌టానికి ప్రయ‌త్నిస్తున్నా.. ఆయ‌న అందుబాటులో ఉండ‌టం లేద‌ని ఆమె పేర్కొంది. దీంతో ఈ కేసులో అమిత్‌ షా సాక్షిగా హాజ‌రు కావాల‌ని కోర్టు సమన్లు జారీ చేసినట్లు న్యాయవాది ఒకరు చెప్పారు.

న‌రోదా ప‌టియాలో జరిగిన వంద మంది ముస్లింల హత్య కేసులో మాయా కొద్నానీ ఇప్పటికే దోషిగా తేలింది. అదే రోజు న‌రోదా గామ్‌లో జ‌రిగిన మ‌రో 11 మంది ముస్లింల హ‌త్యకు సంబంధించి మాయా పాత్రపై విచార‌ణ జ‌రుగుతున్నది. అయితే ఈ హ‌త్యలు జ‌రిగిన స‌మ‌యంలో తాను అహ్మదాబాద్‌లోని తన ఆస్పత్రిలో అమిత్ షా, మరికొందరితో ఉన్నానని మాయా కోర్టుకు చేబుతోంది. అల్లర్లు జ‌రిగిప్పుడు మాయా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ త‌ర్వాత మ‌హిళా, శిశు సంక్షేమ మంత్రిగా ప‌నిచేశారు. 2009లో పోలీసులు మాయాని అరెస్ట్ చేశారు.